రాయచోటి : ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే పాలకుల పతనం తప్పదని ఫ్యాప్టో అన్నమయ్య జిల్లా నాయకులు హెచ్చరించారు. శనివారం ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి, ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా రంగ నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే సాకుతో జిఒ 117 అమలు చేసి ప్రాథమిక విద్యకు పాడెకట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ పరిధిలోని ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేసి ప్రాథమిక పాఠశాలలను అస్తవ్యస్తంగా మార్చివేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే రద్దు చేస్తామన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం నేటికీ కొనసాగుతున్నదన్నారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్‌ను అమలు చేస్తామని ప్రకటించి మరో మారు ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాఠశాలల సందర్శన పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని విమర్శించారు. చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులివ్వడం, సస్పెన్షన్లు చేయడం తగదన్నారు. ప్రవీణ్ ప్రకాష్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి, డిఎ బకాయిలను చెల్లించకపోవడం దారుణమన్నారు. జులై ఒకటో తేదీ నుండి 12వ పిఆర్‌సిని అమలు చేయాల్సి ఉండగా, కమిషన్‌ను నియమించి చేతులు దులుపుకున్నారే తప్ప విధివిధానాలు రూపొందించి అమలు చేయడం లేదని విమర్శించారు. గత పిఆర్‌సి కమిషన్ ఇచ్చిన రిపోర్టును అమలు చేయకుండా దాచి ఉంచిన ప్రభుత్వం, ఇప్పుడు నూతనంగా కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేముండదన్నారు. శాస్త్ర, సాంకేతికత అభివద్ధి చెందిన తరుణంలో నేరుగా పిఆర్‌సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మధ్యంతర భతిని ప్రకటించాలన్నారు. బదిలీ, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండు మాసాలుగా వేతనాలు చెల్లించకపోవడం తగదన్నారు. తక్షణం ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, ఎపిజిఎల్‌ఐ మొత్తాలను ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రావిడెంట్ ఫండ్, ఎపిజిఎల్‌ఐ రుణాల కొరకు, అంతిమ చెల్లింపుల కొరకు దరఖాస్తు చేసుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఉపాధ్యాయుల సమస్యలపై సంఘాలతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి రవిశంకర్, నాయకులు హరిప్రసాద్, అహమ్మద్ ఇలియాస్, హరిబాబు, భాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, రవీంద్రారెడ్డి, వీరాంజనేయులు, ఆర్.వి.రమణ, రజాక్, సిబాతుర్, ఖిలపాయత్, చెంగల్‌రాజు, చంద్రశేకర్, నాగమునిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










