Nov 22,2022 22:42

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

             ఉద్యోగ, ఉపాధ్యాయుల పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, డిఎ, ఎరియర్ల బకాయిలు విడుదల చేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏలూరుజిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.రవికుమార్‌ అధ్యక్షతన ధర్నా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, డిఎ ఎరియర్లు, సరెండర్‌ లీవులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు సుదీర్ఘకాలంగా చెల్లించడం లేదన్నారు. పిఆర్‌సి చర్చల సందర్భంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మార్చి 2022 నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదని తెలిపారు. జులైలో కొద్దిపాటి పిఎఫ్‌ మొత్తం ఇవ్వడం తప్ప మిగిలిన ఆర్థిక బకాయిలు ఇంతవరకూ చెల్లించలేదని, పలుమార్లు కోరినా బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సంబంధిత బకాయిలు రూ.1826 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జెఎసి నాయకులు ఆర్‌ఎస్‌ హరినాథ్‌ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు. జెఎసి కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వివాహ, ఆసుపత్రి ఖర్చులు వంటి అత్యవసర సందర్భాలకు అందాల్సిన సొమ్ములు అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్‌వి.సాగర్‌ మాట్లాడుతూ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి.నరసింహారావు మాట్లాడుతూ పిఎఫ్‌ బకాయిలు సుమారుగా రూ.30 కోట్లు, ఎపిజిల బకాయిలు రూ.20 కోట్లు, డిఎలు, సరెండర్‌ లీవులు, మెడికల్‌ బిల్లుల మొత్తం రూ.65 కోట్లతో మొత్తం ఈ జిల్లాలో రూ.115 కోట్లు ఉమ్మడి జిల్లాగా బకాయిలున్నాయని తెలిపారు. అనంతరం డిఆర్‌ఒ సత్యనారాయణమూర్తికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సోమయ్య, జెఎసి నాయకులు నెరుసు రామారావు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.శ్రీదేవి, ఏలూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు, కోశాధికారి షేక్‌ ముస్తాఫా అలీ, సహాధ్యక్షులు జి.వెంకటేశ్వరావు, యుటిఎఫ్‌ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పి.జయకర్‌, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు, ప్రధానకార్యదర్శి ఎకెవి.రామభద్రం, గౌరవ అధ్యక్షులు ఎం.మార్కండేయులు, కోశాధికారి సిహెచ్‌.పట్టాభి రామయ్య, కార్యదర్శులు జి.రాజేంద్రప్రసాద్‌, ఎంవి.అప్పారావు, ఎస్‌.సుధారాణి, బివి.రవీంద్ర, ఎన్‌.రాంబాబు, పి.క్రాంతికుమార్‌, జి.లక్ష్మీనారాయణ, జి.రామకృష్ణంరాజు, కె.రామకృష్ణ ప్రసాద్‌, ఏలూరు జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.బేతాళరావు, ఏలూరు జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌ కె.కమల్‌కుమార్‌ ఈ ధర్నాలో ప్రసంగించారు.