Jan 06,2023 00:05

సమావేశంలో మాట్లాడుతున్న నానిబాబు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో ఉద్యోగ నియామకాలలో స్థానిక గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, జల వనరుల శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయకపోతే ఐటిడిఎను ముట్టడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం ( జిఎస్‌యు ) నాయకుడు వెచ్చంగి నానిబాబు హెచ్చరించారు. అల్లూరి జిల్లాలో జల వనరుల శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిఎస్‌యు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలన్ని 100శాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలన్న రిజర్వేషన్‌కు సంబంధించిన జిఒ-3 రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ పెండింగ్‌ లో ఉన్నప్పటికీ జిల్లాలో జల వనరుల శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం సరికాదన్నారు. ఇటీవల ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఉద్యోగ నియామకల్లోనూ 98 పోస్టులకు గానూ, 26 పోస్టులు మాత్రమే గిరిజనులతో భర్తీ చేసి మిగతా పోస్టులన్నీ గిరిజనేరేతులతో భర్తీ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖలో ఉద్యోగాలు భర్తీకి కలెక్టర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం 6 శాతం మాత్రమే గిరిజనులకు రిజర్వేషన్‌ కల్పించి, మిగిలిన 94 శాతం ఉద్యోగాలను గిరిజనేతరులకు కేటాయించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు వెంకటరావు, సూరిబాబు, కామరాజు, డేవిడ్‌ రాజు, ఉదరు, రామకృష్ణ, ప్రసాద్‌, దేవదాస్‌, యేసుదాసు, దానియల్‌, సాంబ, ప్రవీణ్‌, దిలీప్‌, మధు, తదితరులు పాల్గొన్నారు.