మితి మీరిన యాంత్రీకరణ, ఆధునీకరణల వల్ల ఉద్యోగాలు పోతాయని, దాంతో ప్రజల కొనుగోలు శక్తి కుదించుకుపోయి ఆర్థిక మాంద్యం మరింతగా పెరిగే ప్రమాదముందన్న ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్య ప్రభుత్వానికి, విధాన నిర్ణేతలకు ఓ హెచ్చరిక వంటిది. అఖిల భారత ఉత్పత్తిదార్ల అసోసియేషన్ (ఎఐఎంఎ) జాతీయ సదస్సులో బుధవారంనాడు ప్రసంగించిన ఆయన ప్రజల వినిమయం పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదని చెప్పారు. కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ఉపాధి కల్పన ఎంతో ముఖ్యమని నిపుణులంతా నెత్తిన నోరు పెట్టుకొని చెబుతున్నా మోడీ సర్కారుకు అది పట్టడం లేదు. మరి సాక్షాత్తూ ఆర్‌బిఐ గవర్నర్ చెప్పిన మాటనైనా వింటుందా? దేశంలో ఉపాధి కల్పనకు, ప్రజల ఆదాయాల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపడుతుందా అన్న సందేహాలు రావడం సహజం. కాని కేంద్ర ప్రభుత్వం తయారీ రంగంలో ఉపాధి కల్పనకు కొత్త అవకాశాలు సృష్టించడం లేదు సరికదా తాను భర్తీ చేయాల్సిన ఉద్యోగాల విషయంలోనూ దాగుడుమూతలు ఆడడం క్షంతవ్యం కాదు.
సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న నేపథ్యంలో లక్షకు పైగా పోస్టుల భర్తీ కోసం భారీ స్థాయిలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆనాడు నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి), రైల్వేలో గ్రూప్-డి నియామకాల కోసం 2019 మార్చిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించగా మొత్తం 1.4 లక్షల పోస్టుల కోసం 2.4 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఉద్యోగాల భర్తీ అతీ గతీ లేదు. దరఖాస్తు చేసిన నిరుద్యోగులు ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తున్నారు కానీ మోడీకి అధికార పీఠం దక్కింది. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని, నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి జన్‌ధన్ అకౌంట్‌లో రూ. 15 లక్షలు జమ చేస్తామంటూ హామీలిచ్చి మోడీ సర్కార్ మొదటి సారి అధికారంలోకి వచ్చింది. రెండోసారి ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని భ్రమల్లో పెట్టి..మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నది. ఇంతకీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారా.. లేదా అన్నది తెలియటంలేదు. ఆర్‌ఆర్‌బి నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) డేటా ప్రకారం..నాడు దేశంలో నిరుద్యోగ రేటు (2019 ఫిబ్రవరి)లో 7.2 శాతంగా ఉన్నది. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగం మరింతగా పెరిగిపోయింది. కడుపు మండిన నిరుద్యోగ యువత మోడీ సర్కార్ నయవంచనను నిలదీస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో ' స్పీక్ అప్ ఫర్ ఎస్‌ఎస్‌సి రైల్వే స్టూడెంట్స్' పేరిట ప్రచారోద్యమం సాగిస్తోంది.
మోడీ హయాంలో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిధులను కార్పొరేట్లకు సమర్పించారు. ఆ కార్పొరేట్లు ఎగనామం పెట్టిన బకాయిలను మాఫీ చేసేస్తున్నారు. అందుకోసం ఏకంగా ఒక బ్యాడ్ బ్యాంకునే నెలకొల్పారు. కార్పొరేట్లు లాభాల వేటలో పడి పెట్టుబడులు పెడితే కోట్ల ఉద్యోగాలు వాటంతట అవే వచ్చేస్తాయని నమ్మబలుకుతూ వచ్చారు. కాని, రాయితీలు పొందడం, చౌకగా ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే తప్ప పెట్టుబడులు పెట్టిందీ లేదు, ఉద్యోగాలొచ్చిందీ లేదు. దేశాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు దోచి పెట్టడమే మోడీ విధానాల సారాంశం. యువజనాగ్రహం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా దేశమంతటికీ విస్తరించి, వివిధ రూపాల్లో నిరసనోద్యమాలు పెల్లుబికే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న 2014 ఎన్నికల హామీని వారు మర్చిపోలేదు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను ఓడించకుండా ఉపాధి సమస్య పరిష్కారం కాదు. అందుకే నిరుద్యోగ యువత ఆ విధానాలపై పోరాడుతున్న రైతులతో, కార్మికులతో, ఇతర ప్రజా ఉద్యమాలతో కలిసి ఉద్యమించాలి. సెప్టెంబర్ 27న జరగబోయే భారత్ బంద్ ఆ ఉద్యమాల్లో ఒక ముఖ్య ఘట్టం. అందులో యువత ముందుండాలి.










