ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ విమర్శించారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో డివైఎఫ్‌ఐ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యులు బి.కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగుల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సిగ్గుచేటని విమర్శించారు. 'నిరుద్యోగం - పరిష్కార మార్గాలు' అంశంపై ఈనెల 25న విజయవాడలో జరుగుతున్న జాతీయ సదస్సును జయప్రదం చేయాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోడీ ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. హామీలతో దేశ ప్రజలను మోసగించడమే కాకుండా దేశ సంపద, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ గద్దలైన అంబానీ, అదానీలకు దోచిపెడుతూ భావితరాల భవిష్యత్తును కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతీసంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న సిఎం జగన్ ఇప్పటి వరకూ నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తమ హామీలను నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రానున్న ఎన్నికలలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు, ప్రజాసంఘాల మద్దతుతో పోరాటాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్, ఏసు, రాజేష్, కార్యకర్తలు నాగు, నాగేంద్ర, ప్రవీణ్ పాల్గొన్నారు.










