Jan 22,2023 00:03

అనకాపల్లి కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేస్తున్న 108 ఉద్యోగులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖ)
108 ఇఎంటి, పైలట్లను ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా సమన్వయకర్త బి.శ్రీనివాసరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ శనివారం విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 108 ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నియామకాలలో 108 ఇఎంటి, పైలట్లకు సర్వీసును బట్టి వెయిటేజ్‌ మార్కులు ఇవ్వాలన్నారు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ సంస్థ వచ్చాక వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. డిమాండ్లపై సోమవారం మరోసారి రిలే నిరాహార దీక్ష చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి బి.పరమేశ్వరరావు, సిహెచ్‌.రమణమ్మ, ఎకె.రావు, కొండబాబు, ఎం.లోవయ్య, శ్రీనివాస్‌, దేవుడు బాబు పాల్గొన్నారు.
అనకాపల్లి : 108 ఉద్యోగులు శనివారం అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని, ప్రతియేటా 20 శాతం వేతన పెంపు అమలు చేయాలని, పిఎఫ్‌ ఈఎస్‌ఐ చెల్లింపులో సమాన వాటాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డిఆర్‌ఓ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిటిఎస్‌ ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు కోటి, అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్ల కార్యదర్శులు శ్రీరామ్మూర్తి, ప్రకాష్‌, ఉమా మహేష్‌ పాల్గొన్నారు.