ప్రజాశక్తి - చీరాల
మండలంలోని ఈపురుపాలెం ఎస్‌కెబీఎన్ఏం ఐటిఐ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం మినీ జాబ్ మేళా నిర్వహించారు. బిసి కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డాక్టర్ తాడివలస దేవరాజులు మాట్లాడుతూ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే అవకాశాలు మన చెంతే ఉంటాయని అన్నారు. నైపుణ్యం, ఉద్యోగం పట్ల అంకితభావం ఉన్న వ్యక్తులు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారని అన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించి, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల ఉన్నత స్థానాలు పొందుతారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ఎ సత్తార్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలో ధైర్యంగా తమ వద్ద ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించి ఉద్యోగాలు పొందాలని కోరారు. జాబ్ మేళాలో 4కంపెనీలు పాల్గొనగా 89మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 59మంది ఉద్యోగాలు సాధించారని ఎపిఎస్ఎస్‌డిసి ప్రతినిధి అనీష్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ హారిక తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, కొమ్మనబోయిన వీరయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ప్రతినిధి దేవరకొండ ప్రవీణ్, ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ప్రతినిధి సౌగంధి, సిఇటిసి ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్, డిక్సన్, మాస్టర్ మైండ్స్ కంపెనీ, ఎలా హెచ్ ఆర్ లు పాల్గొన్నారు.










