Dec 11,2022 00:04

సప్పర్లతో గిరిజనులతో మాట్లాడుతున్న చింతపల్లి ఎఎస్‌పి శివ కిశోర్‌ కుమార్‌

- 14న మాదిగమల్లులో మెగా వైద్య శిబిరం
- ఎఎస్‌పి శివ కిశోర్‌కుమార్‌
ప్రజాశక్తి- సీలేరు

యువ క్రీడాకారులు క్రీడల్లో పోరాట పటిమను ప్రదర్శించి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయికి ఎంపికై ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని చింతపల్లి సబ్‌ డివిజనల్‌ ఏఎస్‌పి శివ కిషోర్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. జీకే వీధి మండలం దారకొండలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసింగ్‌ కమ్యూనిటీ లో భాగంగా సంజీవని అనే పేరుతో మెగా వైద్య శిబిరాన్ని ఈనెల 14న గుమ్మరేవుల పంచాయతీ మాదిగ మల్లులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు, కంటి నిపుణులతో పాటు ఆర్థోపెడికల్‌ వైద్యులు పాల్గొని పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని చెప్పారు. వ్యాధి తీవ్రతను పట్టి ఆపరేషన్లు అవసరమైతే వారికి మైదాన ప్రాంతానికి రిఫరల్‌ చేసి ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతుందని వెల్లడించారు. అదే రోజు యువ క్రీడాకారులు ప్రతిభను వెలికి తీయడానికి మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తామని తెలిపారు. క్రీడల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.25000, ద్వితీయ బహుమతి రూ.15000, తృతీయ బహుమతి రూ.10,000 నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు. గెలిచిన జట్లకు వాలీబాల్‌ కిట్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జికె వీధి విసి అశోక్‌ కుమార్‌, ఎప్‌ఐ అప్పల రాము, స్థానిక ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎఎస్‌పి పర్యటన
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సప్పర్లలో చింతపల్లి డివిజనల్‌ ఎస్పీ శివకిషోర్‌ కుమార్‌ శనివారం పర్యటించారు. సప్పర్ల సంతలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సంతకొచ్చిన గిరిజనులతో ఏఎస్పి శివ కిషోర్‌ కుమార్‌ చర్చించారు. మెగా వైద్య శిబిరంపై ప్రచారం చేశారు.