
ధర్మవరం టౌన్ : చేనేత ఉద్యమ నేతకు తుదివీడ్కోలు పలికారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచిన ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నాయకుడు పోలా రామాంజినేయులు అంత్యక్రియలను ధర్మవరంలో సోమవారం నిర్వహించారు. చేనేత కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించిన ఆయన్ను తుదిసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు తరలొచ్చారు. ఎర్రజెండాను ఆయన భౌతికకాయంపై ఉంచి నేతలు నివాళులు అర్పించారు. రామాంజినేయులు స్వగృహం నుంచి ప్రారంభం అయిన అంతిమయాత్ర బత్తలపల్లి రోడ్డులోని శ్మశానవాటిక వరకు కొనసాగింది. 'జోహార్ పోలా రామాంజినేయులు.. జోహార్.. జోహార్'' అంటూ అంతిమయాత్రలో నాయకులు, కార్మికులు నినదించారు.
పోలా రామాంజినేయులు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ధర్మవరంలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. ఉదయం 9 గంటలకు ఆయన ఇంటి నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. సిపిఎం, సిపిఐతో పాటు వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పోలా రామంజినేయులు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సీపీఎం రాష్ట్ర నాయకులు జి.ఓబులు, శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, జిల్లా నాయకురాలు దిల్షాద్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్దన్న, సుబ్బిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్, నాయకులు జింకాచలపతితో పాటు పలువురు నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్రనాయకులు జి.ఓబులు, జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌లు పోలా రామాంజినేయులు పాడెమోశారు. చేనేత కార్మికులు, ప్రజల నడుమ దిమ్మీల సెంటర్, తేరుబజార్, అంజుమాన్ సర్కిల్, కాలేజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీనగర్ సర్కిల్, పట్టణ పురవీధుల్లో అంతిమయాత్రను నిర్వహించారు. బత్తలపల్లి రోడ్డులోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతిమయాత్ర మొదలు నుంచి చివర వరకు పోలా రామాంజినేయులు జోహార్లు పలికారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దన్న, బడా సుబ్బిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ఆదినారాయణ, సిఐటియు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, సిపిఎం నాయకులు ఎస్‌హెచ్.బాషా, కదిరి నాయకులు నరసింహులు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బాబ్జాన్, సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి మధు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జెవి రమణ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.