May 27,2022 07:03

స్వాతంత్య్రానంతరం గడిచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో రైతాంగం ఎదుర్కొన్న అనేక సమస్యపైన రైతు సంఘం పనిచేసింది. ఎన్నో విజయాలు సాధించింది... స్వామినాథన్‌ కమిషన్‌ సూచన ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం సాధించుకోవలసి ఉంది. అప్పులపాలైన రైతాంగాన్ని రుణ విముక్తి చేయాల్సి ఉంది. రైతు రుణ విమోచన చట్టం సాధించుకోవలసి ఉంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ హక్కును కాపాడుకోవలసి ఉంది. కౌలు రైతుల రక్షణకు సమగ్రమైన చట్టం సాధించుకోవలసి ఉంది. ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణకుగాను సమగ్ర పంటల బీమా పథకాన్ని సాధించుకోవలసి ఉంది. ఇవన్నీ సాధించుకోవాలంటే మరొక దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘానికి వందేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రిటిష్‌ ప్రభుత్వం రీసెటిల్‌మెంట్‌ పేరుతో 25 శాతం శిస్తుల పెంపు, అడవిపై పుల్లరి విధింపు ఒకవైపు...జమిందారుల దోపిడీలు, వేధింపులు, దౌర్జన్యాలు మరొకవైపు...రైతాంగాన్ని చిదిమేస్తున్న కాలంలో వివిధ జిల్లాలలో రైతాంగ సమీకరణ జరిగేది. ఆ క్రమంలోనే 1906లో నెల్లూరు జిల్లా వ్యవసాయ సంఘం మహాసభ, 1914 కృష్ణా జిల్లా రైతు మహాసభ, 1923 గుంటూరు జిల్లా రైతుసభ జరిగాయి. ఈ సంఘాలన్నీ కలిసి 1928 జులైలో గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం ప్రథమ సభ జరిగింది. రీసెటిల్‌మెంట్‌కు వ్యతిరేకంగా రైతు సంఘం ఆందోళనలు సాగించింది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన రైతు సంఘాలన్నీ 1936లో లక్నోలో సమావేశమై అఖిల భారత కిసాన్‌ సభను ఏర్పరిచాయి. స్వాతంత్య్రోద్యమంలో రైతాంగాన్ని భాగస్వాములను చేయలని, జమిందారీ విధానం రద్దు కోసం పోరాడాలని 'అఖిల భారత కిసాన్‌సభ' పిలుపు ఇచ్చింది. ఆ పిలుపును ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం అందిపుచ్చుకుంది.
 

                                                                రైతు రక్షణ యాత్ర

రైతు సమస్యల పరిష్కారం కోరుతూ రైతు రక్షణ యాత్రకు సంకల్పించింది. ఈ యాత్ర 1937 జూన్‌ 3న ఇచ్ఛాపురం నుండి ప్రారంభమైంది. 1512 మైళ్ళు కాలినడకన, 542 మైళ్ళు బస్సులలోనూ ప్రయాణం చేసి 1938 ఫిబ్రవరి 27న మద్రాసు చేరుకున్నది. 525 గ్రామాలు పర్యటించింది. 500 గ్రామసభలు, 60 ఫిర్కా, తాలూకా సభలు జరిపారు. వీటిలో 4 లక్షల 50 వేల మంది పాల్గొన్నారు. ఈ యాత్రకు స్పందించిన మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం కమిటీని నియమించింది. 1938 నవంబరులో ప్రకాశం కమిటీ రిపోర్టు ఇచ్చింది. జమిందారులకు భూమిపై హక్కు లేదని, శిస్తు వసూలు చేసేవారు మాత్రమేనని, రైతు భూమి జప్తు చేయడానికి, వేలం వేయడానికి జమిందారులకు హక్కు లేదని చెప్పింది. సాముదాయక భూములపై రైతులకు హక్కు ఉన్నదని, పోరంబోకులు, కొండలు, అడవులు, అటవీ సంపదలపైన రైతులకు పూర్తి హక్కులున్నాయని పేర్కొన్నది. జమిందారీ విధానం రద్దు చేయమని మాత్రం చెప్పలేదు.
 

                                                      జమిందారీ వ్యతిరేక పోరాటాలు

ఆనాడు రాష్ట్రంలోని జమిందారుల దోపిడీ వర్ణనాతీతం. ఆర్థిక దోపిడీలతో పాటు వెట్టిచాకిరి, సాంఘిక దోపిడీలు నిరాఘాటంగా సాగించేవారు. కాళీపట్నం, మందసా, చల్లపల్లి, మునగాల జమిందారుల భూ ఆక్రమణలకు, అక్రమ వసూళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు సాగాయి. ఈ పోరాటాలను అణచడానికి అరెస్టులు, లాఠీచార్జీలు, కాల్పులు సాగించారు. రైతులు, మహిళలు ఈ పోరాటాలలో ముందు పీఠిన నిలిచారు. మందసాలో చేసిన కాల్పులలో గున్నమ్మ అనే మహిళతో సహా ఐదుగురు మరణించారు. చల్లపల్లి జమిందారీలో గాజుల్లంక గ్రామంలో వియ్యమ్మతో పాటు నలుగురు మరణించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946లో ప్రారంభమై 1951లో ముగిసింది. భూమి కోసం, వెట్టి రద్దు కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమాలకు దేశ్‌ముఖ్‌లంతా రాజధానికి పారిపోయారు.
     తెలంగాణ, మరట్వాడ, కర్ణాటక 17 జిల్లాలు నిజామ్‌ రాజ్యం. జమిందారీ భూములు, దేశ్‌ముఖ్‌ల భూములన్నీ రైతులు ఉచితంగా సాగు చేయాలి. జాగీర్‌ ప్రాంతాలలో 15 బస్తాల ధాన్యం చెల్లించాలి. అంతేగాక వెట్టి, నజరానాలు, సాంఘిక దోపిడీలు తీవ్రంగా ఉండేవి. ఈ పోరాటంలో 4 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతిమంగా నిజాం పాలన అంతమయ్యింది. ఫ్యూడల్‌ నిరంకుశత్వాలు తొలగిపోయాయి. వెట్టిచాకిరీ రద్దయ్యింది. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ అయ్యింది. ఆఖరుకు జమిందారీ విధానం రద్దుకు దారి తీసింది.
             

                                                   రాయలసీమ కరువు, ఆకలి యాత్ర

1951లో రాయలసీమలో పంటలు పండలేదు. ఫలితంగా 1952లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యతరగతి ఇళ్లలో సైతం పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం శిస్తులు తగ్గించకపోగా కోటి రూపాయలు పైగా కొత్త పన్నులు వేసింది. దీనికి నిరసనగా కర్నూలు యాత్ర చేపట్టారు. ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించినా కర్నూలులో 9 వేల మందితో ప్రదర్శన జరిగింది.
 

                                                           సాగునీటి ప్రాజెక్టుల కోసం

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలను మద్రాసుకు తరలించడం కోసం కృష్ణా, పెన్నారు ప్రాజెక్టు నిర్మించ తలపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం భోస్లా కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం సిద్ధేశ్వరం-నందికొండ, పులిచింతల ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఈ సమస్యపై మాచెర్ల, నంద్యాల, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ప్రొద్దుటూరు, పామూరు, తెలంగాణ లలో భారీ ఎత్తున సదస్సులు జరిపి ఆందోళనలు సాగించడంలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులు సాధించుకోగలిగాము. నేటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులు నిర్మించుకోలేకపోవడం క్షంతవ్యం కాదు. ఆ ప్రాజెక్టుల కోసం పోరాటం సాగించాల్సి ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టు పూర్తిచేసి ఉత్తరాంధ్రకు నీరివ్వవలసి ఉంది.
 

                                                                 వాణిజ్య పంటలు

పొగాకు ధరలు పడిపోయిన సందర్భంగా రైతుసంఘం ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో సదస్సులు జరిపి, ఆందోళనలు చేపట్టగా ప్రభుత్వం ఫ్లాట్‌ఫారాల వ్యవస్థను ఏర్పరిచింది. అయినా ఐటిసి కొనుగోళ్ళు సాగించకపోవడంతో తిరిగి ఆందోళనలు ఊపందుకున్నాయి. ఒంగోలు జిల్లా బంద్‌ సందర్భంగా కాల్పులు జరపగా ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చర్చలు జరిపి పొగాకు ఉత్పత్తిదారుల సొసైటీకి కొనడానికి అవకాశం కల్పించింది. దాంతో పొగాకు కొనుగోళ్ళు జరిగి, ధరలు పెరిగాయి.
 

                                                      ఆత్మహత్యలు-పి.వి చౌదరి కమిషన్‌

రాష్ట్రంలో పత్తి పంటకు తెల్ల దోమ సోకింది. పంటను కాపాడుకోవడానికి రైతాంగం బంగారం తాకట్టు పెట్టి క్రిమిసంహారక మందులు వాడారు. అయినా పంట దక్కలేదు. రైతాంగం రుణగ్రస్తమయ్యారు. బ్యాంకులవారు బంగారం వేలం పాటలు మొదలుపెట్టారు. రైతాంగం ఆత్మహత్యలు చేసుకోసాగారు. మన సంఘం మొట్టమొదటిగా రైతుల ఆత్మహత్యలను వెలికితీసి ఆందోళన సాగించడంతో బంగారం వేలంపాటలు నిలిపివేశారు. ఆత్మహత్యలపై కమిషన్‌ వేయమని కోరగా ప్రభుత్వం అంగీకరించలేదు. రైతుసంఘం చొరవ తీసుకుని జస్టిస్‌ పి.ఎ. చౌదరి నాయకత్వాన కమిషన్‌ ఏర్పరిచింది. అందులో రాష్ట్రంలోని అన్ని రైతుసంఘాలను చేర్చింది. ఆ రిపోర్టుల అనంతరం ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడం ఆ విధంగా ప్రారంభమైంది.
 

                                                               కౌలు రైతు ఉద్యమం

90వ దశకం నాటికి డెల్టా జిల్లాలలో కౌలు వ్యవసాయం విస్తరించింది. కౌలురేట్లు తగ్గించాలని, కౌలురైతులకు బ్యాంకు రుణాలు, పంట నష్ట పరిహారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం నడిచింది. ప్రారంభంలో రైతుమిత్ర గ్రూపులు, ఆ తరువాత జె.ఎల్‌.జి గ్రూపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం విస్తరించడంతో ఎల్‌.ఇ.సి కార్డుల చట్టం వచ్చింది. అనంతర ప్రభుత్వాలు చట్టంలో యజమాని సంతకం కావాలనే షరతు పెట్టడంతో కౌలు రైతులకు ఫలితం లేకుండా పోయింది.
 

                                                               విద్యుత్‌ ఉద్యమాలు

1979-80 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ చార్జీ యూనిట్‌కు 12 పైసల నుండి 16 పైసలుకు పెంచడంతో రైతాంగంలో అలజడి రేగింది. రైతుసంఘం ఆధ్వర్యంలో, ఇతర సంఘాలను కలుపుకొని ఆందోళనలు సాగించడంతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం హార్స్‌ పవర్‌కు రూ.50 స్లాబు సిస్టమ్‌కు అంగీకరించింది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ చార్జీని నాలుగు రెట్లు పెంచగా రాష్ట్ర వ్యాపితంగా 143 కేంద్రాలలో 19 వేల మందితో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. 9 గంటల విద్యుత్‌ ఇవ్వడానికి, రెండవ పంట వేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. అయితే 2000 సంవత్సరంలో అన్ని వర్గాలపై చార్జీలు పెంచడం, సంస్కరణలు ప్రారంభించడంతో దానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కలసి ఛలో హైదరాబద్‌కు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. అది సహించలేని ప్రభుత్వం కాల్పులు జరపడంతో మూడు నిండు ప్రాణాలు పోయాయి. అనంతరం వచ్చిన ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకం వచ్చింది.
 

                                                               భూ ఉద్యమాలు

ఈ కాలమంతా రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలతోనూ, సోదర రైతు సంఘాలతోనూ మిగుల భూముల పంపిణీ కోసం, బంజరు భూముల పంపిణీ కోసం, దేవాదాయ భూముల-ఈనాం భూముల సాగుదారుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు నడిపింది. గత రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఎకరాల పేదల భూములను చుక్కల భూములుగా చూపించింది. ప్రస్తుతం సర్వే సెటిల్‌మెంట్‌ చట్టం తీసుకు వచ్చింది. ఈ సందర్భంలో పేద సాగుదారులకెవరికీ నష్టం కలుగకుండా చూడవలసిి ఉంది.
 

                                                            స్వామినాథన్‌ కమిషన్‌

స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలనే పోరాటం కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా ఊపందుకుంది. కేంద్ర బి.జె.పి ప్రభుత్వం ఏకంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చింది. ఆ చట్టాల రద్దు చేయాలని కోరుతూ ఏడాదిపాటు దేశవ్యాపితంగా జరిగిన పోరాటంలో రైతుసంఘం ప్రధాన భూమిక పోషించింది. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా సామ, ధాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించినా రైతాంగం ఐక్యంగా, ప్రజాస్వామికంగా పోరాడింది. రైతాంగ ఉద్యమానికి ప్రభుత్వం తలవంచి మూడు చట్టాలను వెనక్కి తీసుకుంది. స్వాతంత్య్రానంతరం 75 సంవత్సరాల చరిత్రలో ఇదొక గొప్ప విజయం. దేశంలోని 540 రైతుసంఘాలు ఐక్యంగా పోరాడగా, దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజాసంఘాలు మద్దతునివ్వడం మంచి పరిణామం. ఉద్యమంలో కుల మత తత్వాలకు తావు లేకుండా సకల రైతాంగం ఉమ్మడిగా పోరాడడం మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికి మరొక పద్ధతిలో ఆ విధానాన్నే అమలు చేయాలని చూస్తున్నది. మన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆ విధానాలనే బలపరిచినప్పటకి ప్రజా వత్తిడికి లొంగి రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించడం మంచి పరిణామం.
     స్వామినాథన్‌ కమిషన్‌ సూచన ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం సాధించుకోవలసి ఉంది. అప్పులపాలైన రైతాంగాన్ని రుణ విముక్తి చేయాల్సి ఉంది. రైతు రుణ విమోచన చట్టం సాధించుకోవలసి ఉంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ హక్కును కాపాడుకోవలసి ఉంది. కౌలు రైతుల రక్షణకు సమగ్రమైన చట్టం సాధించుకోవలసి ఉంది. ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణకుగాను సమగ్ర పంటల బీమా పథకాన్ని సాధించుకోవలసి ఉంది. ఇవన్నీ సాధించుకోవాలంటే మరొక దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావలసి ఉంది.
 

                                                           75 ఏళ్ల రైతుసంఘ గమనం

స్వాతంత్య్రానంతరం గడిచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో రైతాంగం ఎదుర్కొన్న అనేక సమస్యలపై రైతు సంఘం పనిచేసింది. పరిష్కారానికి వివిధ రూపాలలో ఆందోళనలు, పోరాటాలు సాగించింది. ఎన్నో విజయాలు సాధించింది. స్వతంత్రంగానూ, సోదర రైతు సంఘాలతోనూ వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాలతోనూ కలసి ఉద్యమాలు నిర్వహించింది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే రైతు వ్యతిరేక విధానాలపై ఎడతెగని కృషి సాగించాల్సి వుంది. అందుకు రైతు సంఘం కార్యక్రమాలను సమీక్షించుకుని ముందుకు సాగాల్సి ఉంది. రాబోయే కాలంలో పోరాటాలకు ఈ మహాసభ రూపకల్పన చేయాలి.

/ వ్యాసకర్త : ఎ.పి రైతుసంఘం అధ్యక్షుడు /
వై. కేశవరావు

వై. కేశవరావు