ప్రజాశక్తి-పాడేరు:ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 29వ రోజు కొనసాగాయి. సంక్రాంతి పండుగ రోజుల్లో సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు రాధాకృష్ణ, ప్రభుదాస్ మాట్లాడుతూ, అధికారులు కనీసం స్పందించకుండా ఇప్పటివరకు ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ చేయలేదన్నారు. విద్యార్థుల మరణాల నియంత్రణకు తీరికలేని పరిస్థితుల్లో జిల్లాస్థాయి అధికారులు ఉన్నారని విమర్శించారు. గిరిజనులు, గిరిజన విద్యార్థుల పట్ల అధికారులు ఎంత ప్రేమగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. గిరిజన విద్యార్థులు చనిపోతే తమకెందుకులే అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము చేస్తున్న పోరాటానికి జిల్లాస్థాయి అధికారులు స్పందించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గిరిజన విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు తక్షణమే హెల్త్ అసిస్టెంట్ ఆశ్రమాల్లో నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, పాడేరు ఐటీడీఏ పిఓ ను తక్షణమే సరెండర్ చేయాలన్నారు. ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులను గిరిజన విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పాడేరు ఐటి డి ఎ పిఓను సరెండర్ చేసేంతవరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక నాయకులు మువ్వల లక్ష్మణరావు, చిన్నారావు, బత్తిరి నరేష్, మణి పాల్గొన్నారు.










