Aug 30,2023 00:41

వైసిపి నాయకులకు వినతిపత్రం ఇస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి - సత్తెనపల్లి : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల క్లెయిముల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని పల్నాడు భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కార్మికులు తాము చేసే పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరుతూ బుధవారం స్థానిక వైసిపి నాయకులు, కౌన్సిలర్లను కలిసి వినతి పత్రాలిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాద్‌రావు మాట్లాడుతూ ఒకటో తేదీన మంత్రి అంబటి రాంబాబు వద్దకు సామూహిక రాయబారం నిర్వహించనున్నామని, కార్మికులంతా పాల్గొనాలని కోరారు. కార్మికులకు అందే 12 రకాల సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం నిలిపేసిందని, పల్నాడు జిల్లాలో 2381 క్లెయిములకు గాను రూ. రూ. ఏడు కోట్ల 55 లక్షల 29 వేలు సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు రావాల్సి ఉందని చెప్పారు. ఈ సమస్యలపై పోరాటంలో అందరూ కలిసి రావాలన్నారు. వినతిపత్రాలను వైసిపి ట్రేడ్‌ యూనియన్‌ పట్టణ కన్వీనర్‌ వి.నరసింహారావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోటేశ్వరరావు నాయక్‌, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్‌, షేక్‌ మహమ్మద్‌ గని, ఎస్‌.వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. యూనియన్‌ నాయకులు కె.ఆంజనేయులు, పి.శ్రీనులు పాల్గొన్నారు.