ప్రాంతీయ సదస్సులో అమరావతి జెఎసి ఛైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ఎపిజెఎసి అమరావతి 80 రోజులుగా చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం కొన్ని ఆర్థిక, ఇతర సమస్యలకు ఒక్కొక్క దశ ఉద్యమంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం చూపుతూ ఉత్తర్వుల రూపంలో ఉద్యమ కాలంలో విడుదల చేసిందని, కేవలం ఉద్యమం ఫలితంగానే ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు పేర్కొన్నారు. శనివారం ఏలూరులోని టుబాకో మర్చెంట్స్ ఫంక్షన్ హాలులో ఎపిజెఎసి అమరావతి మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరు జిల్లా ఛైర్మన్ కె.రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 80 రోజులుగా సమస్యలపై ఉద్యోగులు పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం ఏమీ తెలీదన్నట్లు, ఉద్యమం పట్ల చిన్న చూపు చూస్తుందన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, ఉద్యమంపై స్పందించకుండా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంటే ఉద్యమం అంత కసితో ఉధృతమవుతుందే తప్ప వెనుకడుగు వేసేది ఉండదని ఆయన తెలిపారు.
మొదటి దశ ఉద్యమం సందర్భంగా జిపిఎఫ్, ఎపిజిఎల్‌ఐ సొమ్ములు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్, కొత్త జిల్లాలకు 16 శాతం హెచ్‌ఆర్‌ఎ, ఆర్‌టిసి ఉద్యోగుల ఓటి డబ్బుల చెల్లింపు వంటి జిఒలు ఇచ్చిందని, ఈ జిఒలు విడుదలకు కారణం ఎపిజెఎసి అమరావతి పోరాటమేనన్న సంగతి ఉద్యోగులందరికీ తెలిసిందేనన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగులు మరో చలో విజయవాడ పిలుపునివ్వకముందే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిజాయితీగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగులు లేని ఉద్యోగ సంఘం నాయకులతో తమ ఉద్యమంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో స్పష్టత వచ్చే వరకూ ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని దామోదర్‌రావు తెలిపారు. జెఏసి అసోసియేట్ రాష్ట్ర ఛైర్మన్ టివి.ఫణీపేర్రాజు, కోశాధికారి వివి.మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతు ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపేందుకు ఎన్ని ఆటంకాలు సృష్టించి, ఎంత నిలువరించినా అంతకు రెట్టింపుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని, అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా సిద్దంగా ఉన్నరని వారు తెలిపారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో దశలో ప్రాంతీయ సదస్సులు, అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఉద్యమంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. తొలుత స్థానిక పాతబస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సదస్సులో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి సిహెచ్.కృష్టమూర్తి, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కృష్టమోహన్, డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.అర్లయ్య, ఎపి వర్కు ఆర్ట్స్, పిఇటి ఇన్‌స్ట్రక్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.శివకుమార్ రెడ్డి, ఎస్‌బిటిఎస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షురాలు దేవి, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ రాష్ట్ర అధ్యక్షులు కె.సుమన్, విఆర్‌ఒల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆంజనేయకుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ అండ్ మీడియా ఆఫీసర్సు అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర నాయకులు జి.జ్యోతి, జెఎసి జిల్లా ప్రధానకార్యదర్శి బి.రాంబాబు, జిల్లా ఛైర్మన్ శివశంకర్, కృష్టాజిల్లా ఛైర్మన్ తోట వెంకటసతీష్, కర్నూలు జిల్లా ఛైర్మన్ వి.గిరికుమార్‌రెడ్డి. ఉఐటియుసి రాష్ట్ర నాయకులు కృష్ణమాచార్యులు, బండి వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్రనాయకులు బి.సోమయ్య మాట్లాడారు.










