Aug 10,2023 20:43

జెండాను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

రాజంపేట అర్బన్‌ : ఉద్యమాలతోనే హక్కులు సాధించుకోవాలని యుటిఎఫ్‌్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బి.హరిప్రసాద్‌ తెలిపారు. యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం సందఠంగా ఎర్రబల్లి లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో యుటిఎఫ్‌ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా హరి ప్రసాద్‌ మాట్లాడుతూ మైనేని వెంకటరత్నం, దాచూరి రామిరెడ్డి లాంటి సీనియర్‌ నాయకులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు ఉపాధ్యాయులు హక్కులు అనుభవిస్తున్నారని తెలియజేశారు. వారి స్ఫూర్తితో రాబోవు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన సిపిఎస్‌ రద్దు హామీ సాధించే వరకూ ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా సంఘం ఇచ్చే పిలుపును అందుకుని ఉపాధ్యాయులందరూ ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చంగల్‌ రాజు, జిల్లా కార్యదర్శి రమణయ్య, రాజంపేట మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి శివయ్య, గౌరవ అధ్యక్షులు కవలకుంట్ల పాపయ్య, పెనగలూరు మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రావు, కే.వీరయ్య, వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
పీలేరు: ఉపాధ్యాయులు, పాఠశాలలు, సామాజిక న్యాయం కోసం పాటుపడే సంఘం యుటిఎఫ్‌ అని సీనియర్‌ నాయకులు సదాశివరెడ్డి తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీలేరు డివిజన్‌ కార్యాలయం వద్ద నాయకులు యుటిఎఫ్‌ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంఘం 50 సంవత్సరాలుగా ఉపాధ్యాయ లోకానికి ఎనలేని సేవలు చేయడమే కాకుండా, ఉపాధ్యాయులకు ఎన్నో సౌకర్యాలను కల్పించడం జరిగిందని సామాజికంగా జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొని, సామాజిక స్పహ కలిగిన సంఘంగా ఉంటుందని తెలియజేశారు. పాలకులు ఎన్ని ఇబ్బందులు కల్పించినా ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎనలేని సేవలందించి, రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలలో మేటిగా ఉందని మరో నాయకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. సంఘం కార్యకలాపాల్లో నాయకత్వం చురుకుగా పాల్గొని సమాజాన్ని చైతన్యవంతం చేయాలని, సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని అన్నమయ్య జిల్లా నాయకులు శివారెడ్డి, అక్రం బాష, చంద్రశేఖర్‌, రమేష్‌ రెడ్డి, చంగల్‌ రాయులు, మోహన్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పీలేరు, కె.వి పల్లి, రొంపిచర్ల, పులిచర్ల, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల యుటిఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.