Jul 27,2021 14:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతన్న సినిమాను తెలుగురాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ చూసి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాల వల్ల జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విజయవాడలోని హోటల్‌ ఐలాపురంలో ఎపి రైతుసంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన రైతన్న సినిమా దర్శకులు ఆర్‌.నారాయణమూర్తికి అభినందన సభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటాలకు ఈ సినిమా ఉతంగా నిలస్తుందన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ రైతన్న సినిమాలో ఎంతో గొప్ప విలువలతో కూడిన సందేశాన్ని దర్శకుడు పొందుపర్చారని అన్నారు.. తెలుగు ప్రజలు ఈ సినిమాను ఆదరించాలని కోరారు.
జనరంజకంగా ఉంటుంది : ఆర్‌. నారాయణమూర్తి
నటులు, నిర్మాత, దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలతో రైతులకు, ఆహార ఉత్పత్తికి, ఆహార భద్రతకు ఎంత ముప్పు వాటిల్లుతుందనే అంశాన్ని రైతన్న సినిమాలో స్పష్టంగా చూపించినట్లు చెప్పారు. ఈ సినిమా జనరంజకంగా ఉంటుందని అన్నారు. రైతునాయకులు గోపాలకృష్ణ, రావుల వెంకయ్య, వై.కేశవరావు, జమలయ్య, డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, టి.లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, ఆంజనేయులు, దడాల సుబ్బారావు, శ్రామిక మహిళా నాయకులు కె.ధనలక్ష్మి, వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ సినిమ అద్దం పడుతుందని పేర్కొన్నారు.