May 02,2023 01:07

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కెఎస్‌ లక్ష్మణరావు, ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - చేబ్రోలు : ఉద్యమ, విజ్ఞాన కేంద్రంగా ఉపాధ్యాయ భవన్‌ను రూపొందించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రమైన చేబ్రోలులో యుటిఎఫ్‌ మండల కార్యాలయం (ఉపాధ్యాయ భవన్‌)ను లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ పతాకాన్ని యుటిఎఫ్‌ మండల గౌరవాధ్యక్షులు ఐ.శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్‌ సామాజిక స్పృహ కలిగిన సంఘమని, ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఉత్పత్తికి మూల కేంద్రమైన అశేష కార్మిక, రైతు సమస్యలపైనా స్పందించాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణానికి కృషి చేసిన యుటిఎఫ్‌ మండల కమిటి నాయకులర, సారధ్యం వహించిన జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరావును అభినందించారు. రాష్ట్ర సహాధ్యక్షులు కుసుమ కుమారి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో గుంటూరు, తెనాలి, పొన్నూరులో యుటిఎఫ్‌ కార్యాలయాలు ఉన్నాయని, నాలుగో కార్యాలయంగా చేబ్రోలు ప్రాంతంలో ఉపాధ్యాయ భవన్‌ నిర్మాణం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ యుటిఎఫ్‌ పట్ల ఉపాధ్యాయులకు ఉన్న నమ్మకం, అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. దానివల్లే కార్యాలయాల నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఉద్యమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. కళాధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయలపై ప్రభుత్వ దాడిని ఉద్యమాల ద్వారానే తిప్పికొట్టగలమని చెప్పారు. కార్యక్రమంలో దీప్తి పబ్లికేషన్స్‌ అధినేత ఎ.ఆంజనేయులు, యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రమేష్‌బాబు, డి.నాగేశ్వరరావు, నాయకులు కె.పార్వతి, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, అన్నపూర్ణ, విజయరాజు, సహదేవుడు, జెవివి నాయకులు ఎల్‌.వేణుగోపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.