Dec 07,2022 21:55

భూపోరాటాలు, కూలి, ఉపాధి ఉద్యమాలకు వేదికగా వ్యవసాయ కార్మిక సంఘం
వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడిన నాటినుండి కూలి, భూమి, ఇళ్ల స్థలాల సమస్యలపై సుందరయ్య స్థాపించిన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పేదలకు పంచాల్సిన 16 రకాల ప్రభుత్వ భూములపై పెద్దఎత్తున ఉద్యమాలు నడిచాయి. పేదల పక్షాన కార్మికుల హక్కుల కోసం కూలి పోరాటాల నిర్మాణంలో వ్యవసాయ కార్మిక సంఘం కృషి ఎనలేనిది. ఇళ్ల స్థలాల కోసం, కూలి పోరాటాల సందర్భంగా అనేకమంది కూలీలు, పేదలు జైలుకు వెళ్లిన సందర్భాలూ ఈ జిల్లాలో ఉన్నాయి. వ్యవసాయ కార్మిక సంఘం ప్రారంభం నాటి నుండి నేటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ జిల్లాలో 50 వేల సభ్యత్వాన్ని పూర్తిచేసుకుని నేడు 29వ రాష్ట్ర మహాసభ నిర్వహణకు వేదికైంది. ఇప్పటికే జంగారెడ్డిగూడెం పట్టణం ముస్తాబైంది. భూపోరాటాల గడ్డ, ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాటపటిమ చూపిన జంగారెడ్డిగూడెం నేడు వ్యవసాయ కూలీల సభకు సిద్ధమైంది.
ఇప్పటికే సంఘం ఆధ్వర్యాన జిల్లాలో భూమి, కూలి, ఉపాధి, సామాజిక అంశాలపై ఉద్యమాలు సాగుతున్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ఎల్‌టిఆర్‌ భూముల కోసం గత 25 ఏళ్లుగా ఎత్తిన జెండా దించకుండా ఎర్రజెండా ఆధ్వర్యంలో భూపోరాటాలను సాగిస్తోంది. 20 వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉంది. టి.నర్సాపురం మండలంలో పోడు భూముల కోసం సంఘం పోరాడుతుంది. ఆదివాసీ బిడ్డలను చైతన్యపర్చి, సమీకరించి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో భూమి కోసం పోరాడుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో వందల ఎకరాల భూముల్లో పోడు కొట్టి ఆదివాసీ బిడ్డలు వ్యవసాయం సాగిస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో గత 15 ఏళ్ల నుండి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఆందోళన, ఉద్యమాలను సాగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తిప్పికొట్టేందుకు కృషి చేస్తోంది. జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం మండలాల్లో ఎర్రకాల్వ రిజర్వాయర్‌ మిగులు భూములు 3500 ఎకరాలను పేదలకు పంచాలని పెద్దఎత్తున ఆందోళన పోరాటాలను ఐదేళ్ల నుండి సంఘం ఆధ్వర్యంలో సాగిస్తోంది. ఈ జిల్లాలో రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాల నిర్మాతలైన ఉద్దరాజు రామం, అన్నే వెంకటేశ్వరరావు, అన్నే అనసూయమ్మ స్ఫూర్తితో ఈ మహాసభ నిర్వహించబోతున్నాం. సీలింగ్‌ భూముల కోసం దెందులూరు తదితర మండలాల్లో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇళ్ల స్థలాల సమస్యపై పెదవేగి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పోరాటం చేసి వందలాది కుటుంబాలకు గుడిసెలు వేయించిన చరిత్ర వ్యవసాయ కార్మికసంఘానికి ఉంది. కూలీ పోరాటాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా కూలీలందరినీ ఐక్యం చేసి సుదీర్ఘకాలం పోరాటాలు నడిపిన జంగారెడ్డిగూడెం, పెదవేగి, తాళ్లపూడి తదితర మండలాల్లో సామాజిక ఉద్యమాలను కూడా ముందుకు తీసుకెళ్తోంది. 12 మండలాల్లో పామాయిల్‌ కార్మికుల సమస్యలపై పోరాడుతూ వారి హక్కుల కోసం ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ జిల్లా నుండి రాష్ట్రస్థాయి వరకు నిర్విరామంగా పోరాడుతున్న సంఘం వ్యవసాయ కార్మిక సంఘం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభను కుంజా బుజ్జి, సున్నం రాజయ్య తదితరులు స్ఫూర్తితో జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించబోతున్నాం.
-ఎ.రవి, రాష్ట్ర కార్యదర్శి
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం