Feb 28,2023 23:52
ప్రముఖ వైద్యులు యలగాల హనుమంతరావుకు నాయకులు ప్రచార కరపత్రాలను అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-అద్దంకి: ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో పిడిఎఫ్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చురుకుగా సాగుతోంది. అద్దంకి మండలంలో మొత్తం మూడు పోలింగ్‌ స్టేషన్లో పరిధిలో గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 3,500 పైబడి ఉండగా వారిని కలిసి ప్రచారం సాగించే క్రమంలో పిడిఎఫ్‌ అభ్యర్థులను బలపరుస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో బాటు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ఓటును అభ్యర్థిస్తున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, మేధావులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కోసం పిడిఎఫ్‌ తరపున మీగడ వెంకటేశ్వరరెడ్డి పోటీ చేస్తుండగా ఉపాధ్యాయ నియోజకవర్గ నుంచి యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పొక్కిరెడ్డి బాబురెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి విజయాన్ని కాంక్షిస్తూ ఆయా సంఘాల నాయకులు కార్యకర్తలు ఇప్పటికే మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల గొంతుకున వినిపించే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించటమే మంచిదనే చర్చను ఓటర్లయిన విద్యావంతులు ముందుకు తీసుకొస్తున్నారు. మొత్తం మండలాన్ని, అద్దంకి పట్టణాన్ని విభిన్న ప్రాంతాలుగా విభజించుకుని ప్రతి ఓటును కలిసి మద్దతును కూడగట్టడంలో పిడిఎఫ్‌ అభ్యర్థులను బలపరిచే ప్రజా సంఘాలు ముందున్నాయనే చర్చ అద్దంకి టౌన్‌లో విభిన్న రాజకీయ పార్టీలు, సంస్థల నుంచి వినిపిస్తోంది. 2007 నుంచి వరుసగా మూడుసార్లు పిడిఎఫ్‌ అభ్యర్థులు విజయం సాధించడంతో మార్చి 13న జరిగే ఎన్నికల ద్వారా నాలుగోసారి కూడా పిడిఎఫ్‌ గెలుస్తుందనే బలమైన విశ్వాసం ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ వై హనుమంతరావు, మాజీ ఆర్‌జెడి దేవపాలన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడాలన్నా, ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నించాలన్నా పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకోవడం అవశ్యమని, అది విద్యావంతుల బాధ్యత అని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మేధావులు బలపరిచిన మీగడ వెంకటేశ్వరరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకోవాలని కోరారు.