ప్రజాశక్తి-ఈపూరు : మండలంలోని బొమ్మరాజుపల్లి, ఉప్పరపాలెం పంచాయతీల్లో 3 వార్డులకు ఉప ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. బొమ్మరాజుపల్లిలో 1, 7వ వార్డులు, ఉప్పరపాలెంలో 8వ వార్డు సభ్యులు మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. రెండు గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
ప్రజాశక్తి - నకరికల్లు : గుండ్లపల్లిలోని 5వ వార్డుకు ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఎంపిడిఒ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎన్నిక ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారని, 534 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజాశక్తి - అమరావతి : ధరణికోట 11వ వార్డు, ఎండ్రాయి 2వ వార్డుకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎంపిడిఒ ఉమాదేవి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన ఉంటుందని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ నిర్వహణకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.










