
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వర్షాభావం ప్రభావం ఉద్యాన పంటలపైనా పెరుగుతోంది. బోర్లు సౌకర్యం ఉన్న వారే ఈ ఏడాది ఉద్యాన పంటలు సాగు చేయగలుగుతున్నారు. కాల్వలు, వర్షాలపై ఆధారపడిన రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉద్యాన సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కొన్నేళ్లుగా జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తరించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాభావం కూడా ప్రతికూలంగా మారింది. ఆకుకూరలు, కాయగూరలు, పూలతోటల సాగు అత్యంత కష్టతరంగా మారింది. దీంతో జిల్లాలో ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
2022-23లో జిల్లాలో 17 వేల ఎకరాల్లోనే ఉద్యాన పంటలు సాగయ్యాయి. నిమ్మ, అరటి, సపోట, మామిడి తోటలు 9,500 ఎకరాల్లో ఉండగా కంద, చిక్కుడు, బెండ, తీగజాతి కూరగాయలు 5500 ఎకరాల్లో సాగవుతున్నాయి. మరో 2 వేల ఎకరాల్లో పూలు, ఇతర పంటలు సాగు చేశారు. తెనాలి డివిజన్‌లో నీటి వనరులు అందుబాటులో ఉండటం వల్ల ఉద్యాన పంటల సాగు ఎక్కువగా జరుగుతోంది. చేబ్రోలు మండలంలో కూరగాయలు సాగు ఎక్కువగా ఉంది. గతంలో ఉన్న తోటలు కాకుండా ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గింది. కంద, చిక్కుడు, బెండ, దొండ, తీగజాతి తోటల సాగు కేవలం మూడు వేల ఎకరాల్లోనే జరిగింది. కూరగాయాల దిగుబడి తగ్గుతోంది. మరో 200 ఎకరాల్లో ఆకుకూరల ఉత్పత్తికి సాగు దారులు ఇబ్బంది పడుతున్నారు. కాల్వల్లో వచ్చిన నీటిని తోటలకు మళ్లించుకుంటున్నారు. వర్షాభావంతో పూల తోటలకు ఇబ్బంది తప్పడం లేదు. పూలతోటల సాగుదార్లు ఎక్కువ మంది బోర్లు కిందసాగు చేస్తున్నారు. వర్షాభావం వల్ల పసుపు, మిర్చి విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
విస్తరించని సాగు
దాదాపు 9 ఏళ్ల క్రితం రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాలు భూ సమీకరణలో రైతులు సిఆర్‌డిఎకు అప్పగించారు. ఇందులో 18 వేల ఎకరాలు ఉద్యాన పంటలున్నాయి. భూములు తీసుకునేటప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న పండ్లు, పూల, కూరగాయల సాగు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో చేపడతామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో ఎవ్వరూ పట్టించుకోలేదు. మరోవైపు కూరగాయల సాగుకు సంబంధించి షేడ్‌నెట్‌లు, పాలి హౌస్‌ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.9 లక్షల వరకూ సబ్సిడీ ఇచ్చే పథకాలు అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది రైతులను, కొత్త వారిని వీటి వైపు దృష్టి సారించేలా చేయడంలో ఉద్యాన శాఖ శ్రద్ధ చూపడంలేదు. ఇప్పటికే ఉన్న రైతుల నుంచే వీటి ఏర్పాటుపై తమ వాటా తాము తీసుకుని మొక్కుబడిగా సబ్సిడీ పథకాలు మంజూరు చేస్తున్నారు. సూక్ష్మ సేద్యం, తుంపర సేద్యంకు 90 శాతం రాయితీతో పరికరాలు అందిస్తున్నా ప్రతి ఏటా ఎక్కువ మంది రైతులను ఇందులోకి తీసుకు రావడంలో అధికారులు పట్టించుకోవడం లేదు.
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పెరటిలో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు ప్రజల్లో ఆసక్తి ఉన్నా ఉద్యాన శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పెరటి సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఈ అంశంలో అవగాహన కల్పించడంపై కూడా శ్రద్ధ చూపడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్ల పైన కూరగాయల పెంపకం కోసం ప్రభుత్వం ఒక్కొ కుటుంబానికి ఒక యూనిట్ కింద గరిష్టంగా రూ.3 వేల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు ఇందుకు నిధులు విడుదల చేయలేదు. సబ్సిడీ నిధులు రాకపోవడంతో పెరటి సాగు విస్తరణకు తగిన ప్రోత్సాహకాలు లేవు. కాల్వలకు సమీపంలో ఉన్న భూముల్లోనూ ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాల్లేక చాలామంది ఈ పంటలను ఉపసంహరించుకుంటున్నారు. గతంలో మంగళగిరి ప్రాంతంలో ఉల్లి, క్యారెట్ వంటి పంటలను ఎక్కువగా సాగు చేసే వారు. ఇప్పుడు బెంగుళూరు నుంచి ఎక్కువగా క్యారెట్, బీట్ రూట్ దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా పండించే క్యారెట్‌కు తగిన ధర రాక చాలామంది ఉపసంహరించుకున్నారు.