
ప్రజాశక్తి-బొబ్బిలి,తెర్లాం : హత్యకు గురైన ఏగిరెడ్డి కృష్ణ మృతదేహానికి తీవ్ర ఉద్రిక్తతలో నడుమ ఆదివారం స్వగ్రామం ఉద్దవోలులో అంత్యక్రియలు జరిగాయి. కృష్ణను హత్య చేసిన నిందితులు, వారి ఇళ్లపై కృష్ణ బంధువులు, గ్రామస్తులు దాడులు చేశారు. గడ్డి కుప్పలకు నిప్పు పెట్టారు. ప్రత్యర్థుల కారు, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దాడి విషయం పోలీసులకు తెలియడంతో ఉద్దవోలులో భారీ బందోబస్తు నిర్వహించారు. ఉద్రిక్తత పరిస్థితులను అదుపు చేశారు. ఆందోళనకారుల నుంచి పోలీసులు పెట్రోల్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఏగిరెడ్డి కృష్ణ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అధిక సంఖ్యలో గ్రామస్తులు, అభిమానులు తరలివచ్చారు. అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, మండల నాయకులు హాజరయ్యారు.
రాజకీయ ఎదుగుదలే ప్రాణం తీసింది..
ప్రజల అభిమానం, రాజకీయ ఎదుగుదలే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) ప్రాణం తీసింది. గ్రామ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ, గ్రామస్తుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి ఆదారాభిమానాలు పొందడంతో ఓర్వలేని ప్రత్యర్థులు ఉపాధ్యాయుడిని హత్య చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బలోపేతానికి పని చేశారు. 1987లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సర్పంచ్ గా పని చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండడంతో ప్రజలు కృష్ణపై అభిమానాన్ని పెంచుకున్నారు. టిడిపి ఎమ్మెల్యే తెంటు జయప్రకాష్‌కు అనుచరుడిగా పనిచేసి నమ్మిన బంటుగా ముద్ర వేసుకున్నారు. 1998 డిఎస్‌సిలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా పని చేస్తూనే గ్రామంలోను, తెర్లాం మండలంలోను టిడిపి బలోపేతానికి పరోక్షంగా దోహదపడ్డారు. గ్రామంలో కృష్ణ ప్రతిపాదించిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలుపొందుతూ వస్తున్నారు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత, 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు కృష్ణపై రాజకీయ వేధింపులు పెరిగాయి. ఈనేపథ్యంలోనే 2019 ఎన్నికల తర్వాత కృష్ణ తన గ్రూపు వారందరితో కలిసి వైసిపిలో చేరారు. తర్వాత వైసిపి పెద్దలు గ్రామంలోని రెండు గ్రూపులకూ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ గ్రామంలో కృష్ణ మాస్టారికే ప్రజల మద్దతు ఉండేది. దీంతో జీర్ణించుకోలేని ప్రత్యర్థులు కృష్ణపై కక్ష పెంచుకొని సినీ ఫక్కీలో హత్య చేశారు.
సచివాయం వివాదంతో మరింత కక్ష
ఉద్దవోలు సచివాలయాన్ని చెరువు గర్భంలో ప్రత్యర్థి గ్రూపు నాయకులు నిర్మించారు. చెరువు గర్భంలో సచివాలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ గ్రామానికి చెందిన కొంతమంది హైకోర్టులో కేసు వేయడంతో చెరువు గర్భంలో నిర్మాణాలు చేపట్టడం నేరమని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కృష్ణ మాస్టారే హైకోర్టులో కేసు వేయించారని ఆయనపై ప్రత్యర్థులు మరింత కక్ష పెట్టుకున్నారు. అయితే వైసిపి పెద్దల ఒత్తిడితో సచివాలయానికి నిబంధనలకు విరుద్ధంగా రూ.16లక్షల వరకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు చర్చ కూడా సాగుతోంది.
సినీ ఫిక్కీలో హత్య
ఈనేపథ్యంలోనే సినీ ఫిక్కీలో పక్కా ప్లాన్‌తో ఉపాధ్యాయుడు కృష్ణను ప్రత్యర్థి గ్రూపు హత్య చేసింది. బైక్‌పై వెళ్తున్న ఆయనను బొలేరో వాహనంతో ఢకొీట్టి, తరువాత ఇనుపరాడ్లతో కట్టి చంపారు. హత్య చేసి ప్రమాదంలో మరించినట్లు నమ్మించేందుకు హంతకులు ప్రయత్నం చేసినప్పటికీ ఆటో డ్రైవర్ హత్యను చూసి బయట పెట్టడంతో హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.
దిగ్భ్రాంతికి గురైన ప్రజలు
కృష్ణ మాస్టారి హత్యతో ఉద్దవోలు గ్రామంలో ప్రజలు, అధికారులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాస్టారు మరిలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.










