శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో గత మూడు దశాబ్దాలలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గత ప్రభుత్వాలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019 సెప్టెంబర్ 6వ తేదీన పలాసలో కిడ్నీ రీసెర్చి సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్వయంగా ముఖ్యమంత్రే శంకుస్థాపన చేశారు. తమ కష్టాలు తీరుతాయని అక్కడి ప్రజలు సంతోషించారు. అయితే రెండేళ్లు పూర్తయినా ఇంకా పునాది దశలోనే నిర్మాణం ఉండడంతో వారంతా నేడు తీవ్ర నిరాశతో వున్నారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య మాత్రం నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ వింత వ్యాధి వెలుగు లోకి వచ్చి మూడు దశాబ్దాలు అయినా నేటికీ దీనికి గల కారణాలను తెలుసుకోలేకపోవడం విడ్డూరమే. కిడ్నీ వ్యాధి దేశంలో సగటున 7 శాతం మందిలో ఉండగా ఇక్కడ మాత్రం ఏకంగా 37 శాతంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొనడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా చనిపోయి ఉంటారని కొన్ని సంస్థల ప్రాథమిక అంచనా.
శ్రీకాకుళం జిల్లా ఉత్తరాన ఒరిస్సా జాతీయ రహదారిలో గల ఏడు మండలాలను ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. సముద్రతీరం, కొబ్బరి, జీడి, అరటి తోటలతో నిత్యం ఉద్యానవనంలా ఉండడంతో దీనికీ పేరు వచ్చింది. అయితే నేడిది నిత్య మరణాలతో ఉడుకుతోంది.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని నివారణా చర్యలు చేబడతామని హామీ ఇచ్చారు. 2019 సెప్టెంబరు 3వ తేదీన జీవో నెంబరు 102 జారీ చేశారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం, రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇందులో పేర్కొన్నారు. నిర్మాణానికి రూ.50 కోట్లు, సిబ్బంది వేతనాలకయ్యే ఖర్చులకు సాలుకు రూ. 8.3 కోట్లు కేటాయిస్తూ ఆ జీవో జారీ చేశారు. అదే నెల 6వ తేదీన స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదగానే పలాసలో దీనికి శంకుస్థాపన కూడా జరిగింది. శాసన సభ స్పీకర్, అనేక మంది మంత్రులు పాల్గన్న సభలో ఇక ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరిపోయినట్లేనని వక్తలు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం చేసిన హడావిడి ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి.
1993లో వెలుగు లోకి వచ్చిన ఈ వింత వ్యాధిపై ఇప్పటికే కొన్ని సంస్థలు పరిశోధనలు జరిపాయి. విశాఖపట్నం లోని కె.జి.హెచ్, ఐ.సి.ఎం.ఆర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, నిమ్స్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి), కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక రంగ శాఖ ,ఆంధ్ర మెడికల్ కాలేజి వంటి వివిధ సంస్థలు దీనిపై కొంతమేరకు అధ్యయనం చేశాయి. 2010-11 సంవత్సరాలలో హార్వార్డ్ మెడికల్ యూనివర్సిటీ, విశాఖ లోని కె.జి.హెచ్ సంయుక్తంగా మొదటిదశ అధ్యయనం పూర్తిచేశాయి. అయితే నిధుల లేమితో తరువాత అర్ధాంతరంగా నిలిపివేయవలసి వచ్చిందని ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు, ఆంధ్రప్రదేశ్ మాజీ మెడికల్ డైరక్టర్ టి.రవి రాజు తెలిపారు. ఫలితంగా నేటి ఆధునిక యుగంలో కూడా ఇటువంటి వింత వ్యాధికి గల కారణాలను కూడా తెలుసుకోలేకపోవడం, కనీసం ఈ దిశలో నిజాయతీగా కృషి కూడా లేకపోవడం నిజంగా సిగ్గుపడవలసిన విషయమే. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఇటువంటి వ్యాధి ప్రపంచంలో ఉద్దానంతో పాటు, శ్రీలంక, నికరాగువాలలో మాత్రమే ఉంది. అందువల్ల హార్వర్డ్ యూనివర్సిటీ, ఐసిఎంఆర్ వంటి సంస్థల సహకారంతోనే దీనిపై సరైన అధ్యయనం జరగడం సాధ్యపడుతుంది.
అసలు కారణాలను తెలుసుకోలేకపోవడంతో...నీటి వల్లని కొంతమంది, వాతావరణ మార్పుల వల్లని కొంతమంది, ఆహారపు అలవాట్ల వల్లని కొంతమంది, వీటన్నింటి వల్లని మరికొంతమంది ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి అధ్యయనం చేయక పోవడంతో ప్రజలను గాలికి వదిలేసినట్లయింది. సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఏ మాత్రం ఉపశమనం లేదు సరికదా వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నేడు అనేక గ్రామాలలో కనీసం ఇంటికొకరు ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. మందులకు నెలకు కనీసం ఐదు నుండి పది వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వ్యాధి వల్ల పనికి వెళ్ళలేక, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక అనేక మంది అప్పుల పాలవడం, ఆస్తులు అమ్ముకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం 2019-20, 20-21 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్లలో 50 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించినట్లు లెక్కలున్నా అక్కడ నిర్మాణ పనులేవీ ఆ స్థాయిలో జరగలేదు. అదే జీవో ప్రకారం మెడికల్ సూపరింటెండెంట్, ఇద్దరు కిడ్నీ వ్యాధి నిపుణులు, మూత్ర వ్యాధి నిపుణులతో సహా 33 మంది వివిధ రకాల స్పెషలిస్టులు, 60 మంది నర్సులు, 8 మంది రీసెర్చ్ సిబ్బంది, 18 మంది టెక్నీషియన్లు, మరో 45 మంది ఇతర సిబ్బంది నియామకం జరగాలి. భవనమే లేకపోతే, ఇక ఈ సిబ్బంది సంగతి వేరే చెప్పనవసరం లేదు. వెరసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడి స్థితి ఉంది.
ప్రతి ఐదు వందల మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్, కిడ్నీ పేషంట్లకు, వారి సహాయకులకు ఉచిత బస్ పాస్ వంటి అనేక ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. శంకుస్థాపన సందర్భంగానే బాధితులందరికీ వ్యాధి తీవ్రతను బట్టి నెలకు 10 వేలు, 5 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అయితే విచిత్రంగా వేలల్లో వ్యాధిగ్రస్తులుంటే, కేవలం పదుల్లో మాత్రమే సాయం అందుతోంది. పలాస మండలంలోని నీలావతి గ్రామానికి చెందిన 65 ఏళ్ల అప్పల నాయుడు (పేరు మార్చబడింది) అనే వ్యక్తికి వృధ్యాప్య పింఛన్ ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం ఇవ్వడం లేదు. ఈయనకు మందులకే నెలకు ఐదు వేల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. ఇలాంటివారు ఈ ఉద్దానం ప్రాంతంలో అనేకమంది ఉన్నారు. ప్రభుత్వం చేసిన ఆర్భాటానికి, ఆచరణకు ఎక్కడా పొంతనే లేకపోవడం శోచనీయం.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి, నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. స్పెషలిస్టు డాక్టర్లతో పలాసలో తాత్కాలిక ఆసుపత్రిని నడపాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని, ఐ.సి.ఎం.ఆర్, హార్వార్డ్ యూనివర్సిటీలతో సంప్రదించి వ్యాధి కారణాలను అధ్యయనం చేయడానికి రీసెర్చ్ బృందాన్ని ఏర్పరచాలి. శ్రీకాకుళం రిమ్స్‌లో నెఫ్రాలజిస్టులను నియమించాలి. వ్యాధిగ్రస్థులందరికి ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయం అందించాలి.
ఎ. అజ శర్మ
/వ్యాసకర్త: ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి/











