May 21,2021 07:25

   'తౌక్టే' తుపాను పశ్చిమ తీరంలో పెను విలయం సృష్టించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, గోవా రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. కేంద్ర పాలిత ప్రాంతం డామన్‌ డయ్యూ లోనూ భారీ నష్టం సంభవించింది. ముంబాయి హై ప్రాంతంలో ఒఎన్‌జిసి చమురుక్షేత్రం వద్ద లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయిన నౌకల్లో కనీసం 49 మంది దుర్మరణం పాలవ్వగా మరో 27 మంది గల్లంతవ్వడం అత్యంత విషాదకరం. యుద్ధ నౌకలను రంగంలోకి దింపి సహాయ చర్యలు చేపట్టడం వల్ల పి-305 నౌక లోని 261 మందిలో 188 మందిని రక్షించగలిగినా ప్రాణ నష్టం అధికంగానే ఉంది. గుజరాత్‌లో 53 మంది, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో 17 మంది, గోవాలో ఇద్దరు మరణించారు. సమర్ధవంతమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల కేరళలో ప్రాణ నష్టాన్ని నివారించగలిగినా ఆస్తి నష్టం సంభవించింది. ఈ తుపాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఇవి అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేయగా తక్షణ సాయంగా గుజరాత్‌కు వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రకటించడం పక్షపాతానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు.
    సోమవారం అర్ధరాత్రి తౌక్టే తుపాన్‌ సౌరాష్ట్ర ప్రాంతంలో సోమనాథ్‌ జిల్లా ఉనా వద్ద తీరం దాటింది. అంతకు ముందు నాలుగు రోజులపాటు పశ్చిమ తీరంలోని రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. చాలా చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలుల ధాటికి లంగరు వేసిన నౌకలు కొట్టుకుపోవడం పెను విషాదానికి కారణమైంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరం లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసేశారు. కేరళపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంత ప్రజలను తరలించడంవల్ల ప్రాణ నష్టం నివారించగలిగారు. తౌక్టే ప్రభావిత రాష్ట్రాల్లో ప్రజల తరలింపు, సహాయ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా కృషి చేశాయి. అయితే, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిన గుజరాత్‌లో ముందు జాగ్రత్త చర్యలు సమర్ధవంతంగా చేపట్టారా లేదా అన్నది ఒక ప్రశ్నగానే ఉంది. లంగరు వేసిన నౌకలు కొట్టుకుపోయిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఇటువంటి నౌకలను లంగరు వేసిన సందర్భంగా చేపట్టవలసిన రక్షణ చర్యల విషయంలో పాటించవలసిన ప్రమాణాలు అమలు చేశారా? లేదా? అందులో ఒఎన్‌జిసి పాత్ర ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు నిశితమైన దర్యాప్తు ద్వారానే సమాధానం దొరుకుతుంది.
    గుజరాత్‌, డామన్‌, డయ్యూల్లోని ప్రాంతాలను బుధవారంనాడు ప్రత్యేక విమానంలో నుంచి పరిశీలించిన ప్రధాని మోడీ గుజరాత్‌లో తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పెను తుపాను తాకిడికి గురైన ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నివేదికలు వచ్చాకనే వాటికి సహాయం అందిస్తామని చెప్పడం దారుణం. మోడీ భారత దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్‌ రాష్ట్రానికా? అన్న ప్రశ్న ప్రజల మెదళ్లు తొలిచేస్తోంది! తౌక్టే బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్రలో ప్రధాని ఎందుకు ఏరియల్‌ సర్వే చేయలేదని ఎన్‌సిపి నేత నవాబ్‌ మాలిక్‌ ప్రశ్నించడం సబబే కదా! పొరుగు రాష్ట్రాలను సందర్శించి మహారాష్ట్రలో పర్యటించకపోవడం వివక్ష కాదా అన్న ప్రశ్నకు కమలనాథులేం సమాధానం చెబుతారు? గత ఏడాది తుపాను నష్టం జరిగినపుడు కర్ణాటకకు సహాయం చేసిన కేంద్రం కేరళకు మొండి చెయ్యి చూపిన విషయం తెలిసిందే. బిజెపి 'సహకార ఫెడరలిజం' నిజ స్వరూపం ఇదన్నమాట. 'ఒకే దేశం- ఒకే పన్ను- ఒకే మతం- ఒకే భాష- ఒకే ఎన్నికలు ...' అని గొంతు చించుకునే పరివార్‌ శక్తులు కష్టాల్లో వున్న అన్ని రాష్ట్రాలను మాత్రం ఒకేలా చూడరు. వారి విద్వేష సిద్ధాంతం వెనుక కుట్రలను జనం అర్ధం చేసుకుంటున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆశిద్దాం !