Jul 25,2021 21:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పంపు సెట్లకు బలవంతంగా మీటర్లు బిగించడాన్ని తక్షణమే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వై కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు చట్టం కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని విమర్శించారు. విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రయివేటుకు కట్టబెట్టే చర్యలకు ఉపక్రమించడం సరికాదని హితవు పలికారు. ఈ దిశగా తీసుకొచ్చిన జిఒ 22తో వ్యవసాయ పంపుసెట్లకు బలవంతంగా మీటర్లను బిగిస్తోందన్నారు. మీటర్ల బిగింపునకు నిరాకరిస్తున్న రైతులను అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తక్కువ కనెక్షన్లు ఉన్న జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్ల విద్యుత్‌ పంపుసెట్ల కింద సాగులో ఉన్న 30 లక్షల ఎకరాల్లో సేద్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికిపోతున్న రైతులకు విద్యుత్‌ మీటర్ల సమస్య అదనపు భారంగా మారుతోందన్నారు. ఇప్పటికే మీటర్లు పెట్టిన జిల్లాల్లో పంపు సెట్టుకు రూ.3 వేలు నుండి రూ.4 వేలు వరకు నెలవారీ బిల్లు రావడంతో రైతులు బెంబేలెత్తుతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి రైతులు బిల్లులు చెల్లించనక్కర్లేదని ప్రభుత్వం చెబుతున్నా, భవిష్యత్తులో భారాలు మోయక తప్పదనే భయాందోళనలు రైతుల్లో నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి విద్యుత్‌ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టడాన్ని ఆపాలని కోరారు. ఉచిత విద్యుత్‌ను కొనసాగించడానికి చట్టం చేసి రైతులకు నమ్మకం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.