Apr 09,2023 21:39

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
       ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్‌ ఛైర్మన్‌ పసల సూర్యారావు కోరారు. ఆదివారం పట్టణ శివారు బాట గంగానమ్మ లేఅవుట్‌ కాలనీలో స్థానిక బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పసల సూర్యారావు మాట్లాడుతూ ఈ కాలంలో వైద్యం అందని కారణంగా సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ద్వారా పేదలకు వైద్యం అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు వజ్ర కిరణ్‌, డాక్టర్‌ సునీత, ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్‌ కోట సుబ్బారావు రోగులకు ఉచితంగా షుగర్‌, బిపి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు వంగా గోపి, నాయుడు వెంకటేశ్వరరావు, చల్లారి మాణిక్యాలరావు, ప్రజాసంఘాల నాయకులు బొడ్డు రాంబాబు, షేక్‌ సుభాషిణి, ప్రభాకర్‌రావు, రామచంద్రరావు, బొడ్డు యశ్వంత్‌, యువజన సంఘం నాయకులు షేక్‌ మాబుసుభాని పాల్గొన్నారు.
పెదపాలపర్రులో మెగా వైద్య శిబిరం
ముదినేపల్లి :మండలంలోని పెదపాలపర్రులో ఆదివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రిచౌదరి తల్లిదండ్రులు మైనర్‌బాబు దంపతుల జ్ఞాపకార్థం నిర్వహించిన వైద్యశిబిరంలో పెద్దసంఖ్యలో పలువురు గ్రామస్తులు వైద్యసేవలు పొందారు. దివ్య సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యులు వెయ్యి మంది రోగులకు వివిధ రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందచేశారు. వీరిలో 150 మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని గుడివాడ మాజీ ఎంఎల్‌ఎ రావి వెంకటేశ్వరరావు, టిడిపి నేత ఎనిగళ్ల రాము, గ్రామ సర్పంచి రాకేష్‌కుమార్‌, టిడిపి నాయకులు బొర్రా చలమయ్య, కోడూరు శేషుబాబు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బి.విజయలక్ష్మి, దావు నాగరాజు, బొంగు రవికుమార్‌, సిహెచ్‌.జగన్మోహన్‌రావు, గ్రామ ప్రముఖులు సందర్శించారు.