Feb 12,2023 23:59

కంటి పరీక్షలకు క్యూకట్టిన గిరిజనులు

ప్రజాశక్తి -సీలేరు
అల్లూరి జిల్లా, వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధి మంగంపాడులో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న 25 గ్రామాల గిరిజనులు వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఈ శిబిరంలో గుండె, చర్మ వ్యాధి, స్త్రీ వ్యాధి, కంటి, దంత వ్యాధి నిపుణులు, కేరళ వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇందులో 302 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి కంటి ఆపరేషన్‌ చేయవలసిందని కంటి వైద్య నిపుణులు నిర్ధారించారు. వీరిని కంటి ఆపరేషన్‌ నిమిత్తం రాజమండ్రి తరలించారు. మరో 150 మందికి కంటి అద్దాలు అవసరమని వైద్య నిపుణులు సూచించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌ గోలి రామారావు పర్యవేక్షణలో ఈ శిబిరం జరిగింది. శిబిరానికి హాజరైన గిరిజనులకు సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేశారు. గిరిజన వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. జనరల్‌ వైద్య నిపుణులు జి. వెంకటరమణ, కె.ప్రభాకర్‌, కంటి వైద్య నిపుణులు శ్రీకాంత్‌ రెడ్డి, ఆర్థోపెడిక్‌ వైద్యులు కిరణ్‌, జనరల్‌ సర్జన్‌ సునీల్‌, మరికొంతమంది వైద్య నిపుణులు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, డొంక రాయి ఎంపిటిసి కరక రమణ పాల్గొన్నారు.