ఉచిత వైద్య శిబిరాలతో ఆరోగ్యం మెరుగు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
ఉచిత వైద్య శిబిరాలతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు ప్రాంతాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతిరోజూ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలో తాతానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని స్వయంగా రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో ఆసుపత్రులను అధునాతనంగా మార్చిందని, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ అన్వేష్ రెడ్డి, సూపర్డెంట్ రవి, హరి మోహన్, కరుణాకర్, వైఎస్‌ఆర్సిపి నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్, భరణి యాదవ్, శేఖర్ పాల్గొన్నారు.










