ప్రజాశక్తి-బాపట్ల: గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బాపట్ల కమ్మ జన సేవా సమితి అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం కమ్మ జనసేవా సమితి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కమ్మ జన సేవా సమితి పనిచేస్తుందని అన్నారు. కంటి వైద్య శిబిరాల పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాపట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. శిబిరంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ కంటి వైద్యులు దృశ్య, మేఘన కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి పెదకాకాని శంకర నేత్రాలయంలో కంటి శుక్లాలకు శస్త్ర చికిత్సలు చేస్తారని క్యాంప్ ఇన్‌ఛార్జి నాగబాబు తెలిపారు. మొత్తం 3వందల మందికి శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కమ్మ జన సేవా సమితి కార్యదర్శి రామినేని వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు, కోశాధికారి ఏలూరి హరిబాబు, మానం భద్రయ్య, కారుమంచి వీరయ్య పాల్గొన్నారు.










