ప్రజాశక్తి-రేపల్లె: ఉచిత వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజయ సారథి అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సారథి మాట్లాడుతూ తీర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఈ క్యాంపును ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ బాపట్ల జిల్లా చైర్మన్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బిపి, షుగర్, ఆయాసం, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు, క్యాన్సర్ సమస్యలకు, ఎముకలకు సంబంధించిన సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 108 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. క్యాంపులో ప్రముఖ వైద్యులు ఉప్పలపు నారాయణస్వామి, ఉప్పలపు పావని ప్రియాంక, మహేష్ కిరణ్, అరుణ్ తేజ్ పెనుమాక, వినీల్ తెలికి, బివి గురునాథశర్మ, ఎం శ్వేత, కిషన్‌బాబు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెనాలి సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కార్యదర్శి భానుమతి, సభ్యులు అడుసుమల్లి ప్రభాకర్‌రావు, సయ్యద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.










