ప్రజాశక్తి-పాడేరు : సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో గిరిజన యువతకు అందించనున్న ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 1843 మంది అభ్యర్థులు దరఖాస్తులు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు 1735 మంది దరఖాస్తుల సమర్పించారు.ఐటిడిఏ పిఓ వి. అభిషేక్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ నెల 7వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందని స్పష్టం చేసారు. మొదటి దశ రాత పరీక్షకు ఈనెల 9వ తేదీ నుండి హాలు టికెట్లు జారీ చేస్తామన్నారు. 16న మధ్యాహ్నం చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్, పాడేరు తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, అరకువ్యాలీ యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను ప్రిలిమినరీ ( మొదటి దశ) రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 18 తేదీన ప్రకటిస్తామని పేర్కొన్నారు. 19 వ తేదీన మెయిన్ పరీక్ష (రెండవ దశ)కు హాలు టికెట్లు జారీ చేస్తామని తెలియ జేసారు. 22 వ తేదీన పాడేరు తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో రెండవ దశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 26న రెండవ దశ ఫలితాలు వెల్లడించి ఇంటర్వ్యూకు అర్హతలు సాధించిన అభ్యర్ధులకు 27న ఇంటర్వ్యూలకు హాలు టికెట్లు జారీ చేస్తామన్నారు. ఈ నెల 30, 31 తేదీలలో ఐటిడిఏలో ఇంటర్వ్యూలు నిర్వహించి నవంబరు 1న తుది జాబితా వెల్లడించి 2వ తేదీ నుండి విశాఖపట్నం వేపగుంట యూత్ శిక్షణా కేంద్రంలో సివిల్స్ శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.










