May 11,2021 07:31

   అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేయడం తన బాధ్యతగా ప్రభుత్వం అంగీకరించడం అంటే ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు ఉంది అని ప్రభుత్వం గుర్తించినట్టు అవుతుంది. అందుచేత అందరికీ ఒకే రేటుకు వ్యాక్సిన్‌ ను అందించాలి. అటువంటి ఒకే ఒక రేటు ఉచితంగా అందించడమే. అలా కాకుండా వేరే ఎంత రేటు నిర్ణయించినా అనేక స్థాయిలలో ఆదాయాలు ఉన్న ప్రజల మీద దాని భారం వేరువేరు మోతాదుల్లో పడుతుంది. అంటే ప్రభుత్వం ఒక్కొక్కరి జీవితానికీ ఒక్కొక్క విలువ నిర్ణయించినట్లవుతుంది. జీవించే హక్కు అందరికీ సమానమే గనుక, ప్రభుత్వం అందరి జీవితాలకూ ఒకే విధంగా విలువ నిర్ణయించాలి గనుక, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ను అందించడమే దానికి సరైన పరిష్కారం.
   కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీని ''సరళీకరించడం'' మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలోకెల్లా మతిమాలిన నిర్ణయం. వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేసే రెండు సంస్థల నుండీ కొనుగోలు చేసే ఏకైక వినియోగదారుడిగా ముందు కేంద్ర ప్రభుత్వమే ఉండింది. రూ. 150 చొప్పున ఒక్కో డోసుకీ ధర కూడా నిర్ణయించారు. ప్రజలకు ఆ వ్యాక్సిన్‌ ను ప్రభుత్వం ఉచితంగా అందించాల్సి వుంది. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా కూడా ప్రజలకు అందించడానికి వీలు కల్పించారు. ఆ ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానికి వ్యాక్సిన్‌ ధర చెల్లించాల్సి వున్నందున అవి ఒక్కో డోసుకు రూ.250 చొప్పున వసూలు చేయవచ్చునని కూడా నిర్ణయించారు. కాని హఠాత్తుగా తీసుకున్న ఈ వ్యాక్సిన్‌ ''సరళీకరణ'' నిర్ణయంతో అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తి చేసే కంపెనీల నుండి, ఆ కంపెనీలు నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయాలి.
   ఒక పక్క వ్యాక్సిన్‌ ల కొరత ఎక్కువగా ఉండడం, మరో పక్క కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించడం, దానివలన వ్యాక్సిన్‌ ల అవసరం ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో ప్రభుత్వం తీసుకున్న ఈ ''సరళీకరణ'' నిర్ణయాన్ని వ్యాక్సిన్‌ కంపెనీలు చాలా సంతోషంగా స్వాగతించాయి. ఉత్పత్తి ఖర్చుతో ఏ మాత్రమూ సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో చాలా ఎక్కువ ధరలను నిర్ణయించాయి (ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే వ్యాక్సిన్‌ రేటును కాస్త తగ్గించాయి. దానిని బట్టే ఆ ధరలను ఒక సహేతుకమైన విధానం ప్రకారం నిర్ణయించలేదని రుజువౌతున్నది).
   అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్‌ ను అందిస్తామని ప్రకటించాయి. అయితే, ఇప్పటికే దిగజారిన వాటి ఆర్థిక పరిస్థితులు అందుకు అవకాశం ఇస్తాయా అన్నది సందేహమే. కాని ప్రైవేటు ఆస్పత్రులకు ఆ సమస్య రాదు. వారి వద్దనుండి ఎక్కువ రేటు వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు వసూలు చేస్తే, వాళ్ళు అంతకంతా తమ పేషెంట్ల నుండి ఎక్కువే గుంజుకోగలరు. కనుక జనాభాలో గణనీయమైన భాగం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం చాలా పెద్ద మొత్తాల్లో ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంది.
   ప్రైవేటు ఆస్పత్రులను పోషిస్తున్న కొందరు సంపన్నులు వ్యాక్సిన్‌ ల కోసం ఆమాత్రం ఎక్కువ ఖర్చు చేస్తే నష్టం ఏమిటి? వారికి కూడా సబ్సిడీ రేటుకే ప్రభుత్వం వ్యాక్సిన్‌ ను ఎందుకు అందించాలి ? అని అడిగేవారు ఉన్నారు. దీనికి రెండు స్థాయిలలో సమాధానం చెప్పవచ్చు.
   మొదటిది- తక్షణం మన దేశంలో వ్యాక్సిన్‌ ల కొరత చాలా తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే దాంట్లో సగం కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. తక్కిన సగంలో వాటాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆస్పత్రులతో పోటీ పడాలి. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఉత్పత్తిదారులు ఎక్కువ రేటు పొందవచ్చు గనుక సహజంగానే వాటికి ఎక్కువ వాటా పోయే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌లు అవసరమైన మేరకు అందకుండా పోతాయి. అప్పుడు చాలామంది సామాన్యులు కూడా ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తుంది. అంటే వ్యాక్సిన్‌ ల అధిక ధరల భారాన్ని కేవలం కొద్దిమంది సంపన్నులే గాక చాలామంది పేదలు కూడా మోయవలసి వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇంకో రేటు నిర్ణయించి ఎవరి కోటా ఎంతో నిర్ధారించకుండా ఊరుకోవడం బొత్తిగా మతిమాలిన నిర్ణయమే. మోడీ ప్రభుత్వం చేసింది సరిగ్గా ఇదే.
   అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేయడం తన బాధ్యతగా ప్రభుత్వం అంగీకరించడం అంటే ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు ఉంది అని ప్రభుత్వం గుర్తించినట్టు అవుతుంది. జీవించే హక్కు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉంది. అందుచేత అందరికీ ఒకే రేటుకు వ్యాక్సిన్‌ ను అందించాలి. అటువంటి ఒకే ఒక రేటు ఉచితంగా అందించడమే. అలా కాకుండా వేరే ఎంత రేటు నిర్ణయించినా అనేక స్థాయిలలో ఆదాయాలు ఉన్న ప్రజల మీద దాని భారం వేరువేరు మోతాదుల్లో పడుతుంది. అంటే ప్రభుత్వం ఒక్కొక్కరి జీవితానికీ ఒక్కొక్క విలువ నిర్ణయించినట్లవుతుంది. జీవించే హక్కు అందరికీ సమానమే గనుక, ప్రభుత్వం అందరి జీవితాలకూ ఒకే విధంగా విలువ నిర్ణయించాలి గనుక, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ను అందించడమే దానికి సరైన పరిష్కారం అవుతుంది.
   ఓటు హక్కు ఏ విధంగా ఒకానొక వయస్సు దాటిన తర్వాత పౌరులందరికీ సమానమో, ఆ హక్కును కల్పించేందుకు ఎటువంటి ధరనూ ఏ విధంగా నిర్ణయించలేరో, (అలా ధరను గనుక నిర్ణయిస్తే అది సమానత్వ ప్రాతిపదికను ఉల్లంఘిస్తుంది. అంటే ఓటు హక్కు సార్వత్రికం అనే సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది) అదే విధంగా కోవిడ్‌ నుంచి రక్షణకు ఉచితంగా వ్కాక్సిన్‌ ను పొందే హక్కు అందరికీ ఒకే విధంగా ఉంది.
   అయితే అందుకోసం అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం సమీకరించుకోవలసి వుంటుంది. అందుకోసం అది వివిధ స్థాయిలలో, వివిధ తరగతుల ప్రజలపై పన్నులు విధిస్తుంది. పన్నుల విధింపులో విచక్షణ ఉంటుంది కాని వ్యాక్సిన్‌ ను అందించడంలో ఎటువంటి వివక్షతా ఉండకూడదు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ను అందించాలంటే కేంద్రమే మొత్తం వ్యాక్సిన్‌ను సేకరించి ప్రైవేటు ఆస్పత్రులతో సహా వివిధ మార్గాల ద్వారా ప్రజలకు అందించే ఏర్పాట్లు చేయాలి (ఆ ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఎటువంటి రుసుమూ ప్రజల నుండి వసూలు చేయకూడదు).
   ప్రస్తుతం ప్రకటించిన మూడు దొంతర్ల ధరల విధానం ( కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు మరో రేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇంకో రేటు) కన్నా ముందు కేంద్రమే మొత్తం వ్యాక్సిన్‌లను అన్నింటినీ డోసుకు రూ.150 చొప్పున సేకరించింది. అప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తి ధరలో పెరుగుదల పెద్దగా ఏమీ లేదు. కాబట్టి అదే ధరకి ఇప్పుడు కూడా కేంద్రం మొత్తం వ్యాక్సిన్‌ అంతటినీ కొనుగోలు చేయవచ్చు. మొత్తం 120 కోట్ల జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్‌ అవసరం అనుకుంటే అంతా కలిపి రూ.36,000 కోట్లు అవుతుంది.
   పదమూడు రాజకీయ పార్టీల నాయకులు కలిసి ఉమ్మడిగా ప్రధాని మోడీకి రాసిన లేఖలో ప్రభుత్వ బడ్జెట్‌ లో అన్ని రకాల వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలకూ కలిపి కేటాయించిన బడ్జెట్‌ మొత్తాన్ని ఈసారి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం మళ్ళించమని సూచించారు. ఒకవేళ ఆ విధంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధం కాకపోయినా, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం అవసరమయ్యే మొత్తం మేరకు ముందు ద్రవ్య లోటును పెంచవచ్చు. దానివలన ద్రవ్య లోటు పెరిగేది కేవలం 0.2 శాతం మాత్రమే. దానిని అంతర్జాతీయ, జాతీయ ఫైనాన్సు మార్కెట్లు పెద్దగా పట్టించుకోవు కూడా. పైగా, ఒక వైపున కోట్లాది ప్రజల ప్రాణాలకే ముప్పు వచ్చినప్పుడు దానిని పట్టించుకోకుండా ఫైనాన్సు మార్కెట్ల స్పందనల గురించి ఆందోళన పడడం ఒక విధంగా అతి పెద్ద నేరం.
   మరి ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిణీని ''సరళీకరించడానికి'' దాని అమానుషత్వమైనా కారణం అయివుండాలి, లేదా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నుంచి ప్రతికూల స్పందన వస్తుందని భయపడైనా వుండాలి. రెండో విడత కరోనా వయస్సు మీరిన వారిపైప మాత్రమే గాక యుక్తవయస్కుల మీద కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. అందుచేత వ్యాక్సిన్‌ను అన్ని వయస్సులవారికీ అందుబాటులోకి తేవాలి. దానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దానివలన ద్రవ్యలోటు మరింత పెరుగుతుంది. అలా పెరిగితే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆగ్రహిస్తుంది. కాని ఏ ప్రభుత్వమైనా, ప్రజల జీవితాలకన్నా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనుగ్రహానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిందంటే అది దేశానికి ద్రోహం చేసినట్టే.
   ఇక వ్యాక్సిన్‌ ల సరఫరా సంగతి చూద్దాం. కోవిషీల్డ్‌ ను తయారు చేసే ఎస్‌ఐఐ కి రూ.3,000 కోట్లు, కోవ్యాక్సిన్‌ ను తయారు చేసే భారత్‌ బయోటెక్‌ కు రూ.1,500 కోట్లు కేంద్రం నిధులు ఇచ్చింది. ఆ సంస్థలు తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ నిధులను ఇచ్చింది. కాని ఆ సంస్థలు ఎప్పటికి తమ ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుతాయో, దేశానికి ఎప్పటికి ఎంత వ్యాక్సిన్‌ అవసరం అవుతుందో ఆ సమయానికి అంత వ్యాక్సిన్‌ ను అందించగలిగేలా ఆ సంస్థలు తమ ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచగలుగుతాయో లేదో ఏదీ స్పష్టంగా లేదు. దేశ ప్రజలను ఈ విషయంలో కేంద్రం విశ్వాసంలోకి తీసుకోలేదు. వాళ్ళకి వాస్తవాలు చెప్పడం లేదు.
   ఇవిగాక ఇంకో రెండు సమస్యలున్నాయి. ఎస్‌ఐఐ బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఎస్‌ఐఐ బ్రిటన్‌ లో వ్యాక్సిన్‌ ల ఉత్పత్తి కోసం 24 కోట్ల పౌండ్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే కరోనా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ సమయంలో ఎస్‌ఐఐ తన యావత్‌ శక్తినీ ముందు ఈ దేశంలో అవసరమైన వ్యాక్సిన్‌ ల తయారీకి వినియోగించేటట్టు చూడడం, తన వనరులను ఇతర దేశాలకు మళ్ళించకుండా చూడడం చాలా అవసరం. ఇది గ్యారంటీ చేయాలంటే ఎస్‌ఐఐ వ్యవహారాల మీద ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండి తీరాలి. అది జరగాలంటే ఎస్‌ఐఐ మేనేజిమెంట్‌ లో ప్రభుత్వ ప్రాతినిధ్యం ఉండాలి. ముఖ్యంగా రూ.3000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఎస్‌ఐఐ కి ఇచ్చాక ఆ సొమ్ము ఏ విధంగా వినియోగించబడుతోందో దానిమీద ప్రభుత్వం ఓ కన్నేసి వుంచాలి. ఇటువంటిదే భారత్‌ బయోటెక్‌ విషయంలో కూడా జరగాలి.
   యూరోపియన్‌ యూనియన్‌కు వ్యాక్సిన్‌ సరఫరా అనుకున్న సమయానికి చేయడంలో ఆస్ట్రాజెనెకా విఫలమైంది. అందువలన ఇక్కడ ఎస్‌ఐఐ, భారత్‌ బయోటెక్‌ ప్రజాధనాన్ని వాడుకుని ఇక్కడ ఒప్పుకున్న మేరకు వ్యాక్సిన్‌ సరఫరా సమయం ప్రకారం చేయడంలో వెనకబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుచేత ఆ రెండు కంపెనీల లోనూ ప్రభుత్వ ప్రతినిధుల జోక్యం తప్పనిసరిగా ఉండడమేగాక, అనుకున్న సమయానికి, ఒప్పుకున్న రేటు డోసుకు రూ.150 చొప్పున కేంద్రానికి అందించాల్సిన వ్యాక్సిన్‌ లను అందించేటట్టు గ్యారంటీ చేయాలి.
   ఇక రెండవది- ఈ రెండు కంపెనీల వరకే ప్రభుత్వం పరిమితం కాకుండా కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానాన్ని తీసుకువచ్చి కొత్త ఉత్పత్తి కేంద్రాలకు, మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతనివ్వాలి. వాటినుండి కూడా రూ.150 రేటుకి కొనుగోలు చేయాలి. కోవిడ్‌-19 ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. అందుచేత దానిని ఎదుర్కొని ఓడించడానికి కూడా యుద్ధ ప్రాతిపదికనే చర్యలు చేపట్టాలి.
 

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌