Apr 16,2023 01:48
మందులు పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ లోయబాబు

ప్రజాశక్తి-రేపల్లె: మండలంలోని ఆరవపల్లి గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్‌ లోయబాబు నాంచారయ్య తెలిపారు. పశువులకు గర్భకోశ వ్యాధి మందులు, ఎముకల పొడి, టానిక్‌లు ఉచితంగా అందజేశారు. పశు వైద్యాధికారి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ పశువులు ఈనిన వెంటనే బలమైన ఆహారం పెట్టాకుండా మూఢనమ్మకాలతో ఎండుగడ్డి, పచ్చిగడ్డి పెడితే పశువులు బలహీనపడతాయన్నారు. సమీకృత దాణ, ఖనిజ లవణ మిశ్రమాన్ని పెట్టాలన్నారు. మొత్తం 330 గేదెలు, దూడలకు, 25 ఆవులు, ఎద్దులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున వాక్సినేషన్‌ వేసిన పశువులను మేతకు బయటకు వదలకుండా ఒక రెండు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.