జంగారెడ్డిగూడెం : సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని తాడువాయి గ్రామ బిస్మిల్లా చికెన్ సెంటర్‌లో జంగారెడ్డిగూడెం డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పటాన్ మస్తాన్, పఠాన్ బాజీ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంను డాక్టర్ రాజీవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంకు చెందిన డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నిడదవోలు జాగృతి కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ 80 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వారిలో 25 మందికి కళ్ల జోళ్లు అవసరం ఏర్పడగా జాగృతి కంటి ఆసుపత్రి అధ్వర్యంలో 50 శాతం రాయితీలో అవసరమైన కళ్ల జోళ్లు పంపిణీ చేసామన్నారు. అలాగే 8 మందికి కంటి ఆపరేషన్‌లు చేయాల్సి ఉండగా నిడదవోలుకు తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్‌లు చేయించడం జరుగుతుందన్నారు. తమకు సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు, బిస్మిల్లా చికెన్ సెంటర్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.










