ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి ప్రభుత్వాస్పత్రి ఆవరణలో గురువారం కర్నూలు విశ్వభారతి డాక్టర్లు చంద్రశేఖర్, వీరేంద్ర, ప్రీతి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించిందని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ జమీల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలానికి చెందిన 80 మంది రోగులు పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వీరిలో ముగ్గురికి క్యాన్సర్ నిర్ధారణ అయిందన్నారు. పదిమందికి ప్రారంభ దశలో ఉందన్నారు. ఇలాంటి పరీక్షల వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకుంటారన్నారు. రోగులకు గర్భాశయ, ఊపిరితిత్తులు, రొమ్ము, నోటికి సంబంధించి వచ్చే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యపరంగా పురుషులు, మహిళలు అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏ రోగమైనా ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి ఎఎన్‌ఎంలు, ఆశాలు సహకరించారన్నారు. సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, ఫార్మాసిస్ట్ కృష్ణ, పిహెచ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.
రోగులను పరీక్షిస్తున్న విశ్వ భారతి ఆస్పత్రి వైద్యులు










