Aug 20,2023 00:41

వైద్య పరీక్షలు పొందుతున్న మహిళలు

ప్రజాశక్తి -ములగాడ : ధాన్‌ ఫౌండేషన్‌, మల్కాపురం కళంజియ సమాఖ్య ఆధ్వర్యాన శ్రీహరిపురంలోని సమాఖ్య కార్యాలయంలో మహాత్మాగాంధీ కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సహకారంతో కేన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తి నివారణ పొందవచ్చని తెలిపారు. ఆసుపత్రి డాక్టర్‌ ఎన్‌.భవాని మాట్లాడుతూ, 40 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ ఎప్పటికప్పుడు గైనిక్‌ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని, బ్రెస్ట్‌లో గడ్డలకు సంబంధించిన స్వీయ పరీక్షలు చేసుకోవాలని, నెలసరిలో ఏవైనా మార్పులు, సమస్యలు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారంలో తగు పోషకాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈ క్యాంపులో 120 మందికి పైగా కళంజియం సభ్యులు తనిఖీలు చేయించుకోగా 4గురికి సమస్య ఉన్నట్లు తేలింది. వీరిని మహాత్మా గాంధీ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిజినెస్‌ మేనేజర్‌ శివరామకృష్ణ, వైజాగ్‌ రీజినల్‌ హెల్త్‌ కో-ఆర్డినేటర్‌ మురళీకృష్ణ, సమాఖ్య కో-ఆర్డినేటర్‌ సుభాషిణి, హెల్త్‌ అసోసియేట్‌ విజయ, సమాఖ్య సిబ్బంది, సమాఖ్య నాయకులు, క్లస్టర్‌ ఈసీ లీడర్లు, క్లస్టర్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.