ప్రజాశక్తి -గాజువాక : ఊబకాయం వల్ల కేన్సర్ వ్యాధికి అవకాశముందని, అది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కిమ్స్ ఐకాన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ డి.రఘునాధరావు తెలిపారు. గాజువాకలోని తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం కేన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవన విధానంలో మార్పులతో కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించారు. కేన్సర్ నివారణకు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం, పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం మానేయాలని సూచించారు. చిన్నపిల్లల్లో చదువుతోపాటు క్రీడలకు అవకాశం ఉండేటట్లు చూడాలని కోరారు. అర్బన్ ప్రాంత మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్, గ్రామీణ ప్రాంత మహిళల్లో సర్వైకల్ కేన్సర్ ఎక్కువగా ఉందని తెలిపారు.
కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డాక్టర్ డి.లీల మాట్లాడుతూ, మహిళలు 30 సంవత్సరాలు దాటిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం మంచిదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేళ్లలో సర్వైకల్ కేన్సర్ తగ్గించాలనే ప్రయత్నంలో ఉందని తెలిపారు. అక్టోబర్ నెల అంతా రొమ్ము కేన్సర్ అవగాహన మాసంగా పేర్కొన్నారని తెలిపారు. 10 ఏళ్ళ లోపు ఆడపిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా ఉండేందుకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రీన్ లైఫ్, సిరి, స్వర్ణసాయి అపార్ట్‌మెంట్లకు చెందిన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరందరూ ఇద్దరు డాక్టర్లతో మాట్లాడి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సుగర్ వ్యాధుల నిపుణులు డాక్టర్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ, మంచి ఆహారపు అలవాట్లతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. పాస్ట్‌ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. సమైఖ్య అపార్ట్‌మెంట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రజాశక్తి మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ ఎం.రమేష్‌కుమార్, తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్ మహిళా వెల్ఫేర్ అధ్యక్షులు, కార్యదర్శులు బి మణి, స్వప్న పాల్గొన్నారు.










