
- ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలు
న్యూఢిల్లీ : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్ భారత్‌లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత కంపెనీలో ప్రధానంగా ఉద్యోగుల తొలగింపు, పొదుపు చర్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై కఠోర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపూ 3,800 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) పరాగ్ అగర్వాల్‌ను, సిఎఫ్‌ఒలను ఇంటికి పంపించారు. స్వయంగా సిఇఒ బాధ్యతలను మస్క్ తీసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులను తొలగించారు. ట్విటర్‌లో దాదాపు సగానికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు జాబితాను సిద్దం చేశారని రిపోర్టులు వస్తున్నాయి. ట్విటర్‌లో మొత్తం ఉద్యోగులు 7,500మంది ఉండగా.. శుక్రవారం రోజు వారిలో సగం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ విషయమై ట్విట్టర ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. ఆఫీస్‌కు రావొద్దని, ఇంటికి వెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ''మీరు ఆఫీస్‌లో ఉన్నా.. ఆఫీస్‌కు బయలు దేరినా దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి' అంటూ తమ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో ట్విటర్ రాసింది. అనేక కంపెనీలు ఇప్పటి వరకు ఉద్యోగులను తొలగించాయి. కానీ.. ఇంత దారుణంగా దారి మధ్యలోంచే ఇంటికి వెళ్లిపోవాలని సూచించడం ఇదే తొలిసారి. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు రెండు నెలల జీతంతో పాటు.. వారి ఈక్విటీలకు సమానమైన నగదును మూడు నెలల్లో చెల్లించనున్నట్లు ట్విట్టర్ వర్గాలు తెలిపాయి.
భారత్‌లోనూ పలువురు ఉద్యోగులకు తొలగింపు లేఖలు అందాయని సమాచారం. అయితే ఇక్కడ ఎంత మందిని తొలగించేది స్పష్టత లేదు. దేశంలోని పలువురు ఉద్యోగులకు కార్యాలయాలకు చేరుకున్న తర్వాత అధికారిక ఇ-మెయిల్స్, గ్రూప్ చాట్‌ల యాక్సెస్ కోల్పోవడంతో మరింత గందరగోళానికి గురయినట్లు తెలిపారు. తాము ఇంటి నుంచి పనిలో భాగంగా తమ సిస్టమ్స్‌లో లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే అనుమతించడం లేదని వాపోయారు. తమ ఉద్యోగాలు ఉన్నాయో, పోయాయో తెలియక ఆందోళనకు గురవుతున్నట్టు తెలిపారు. కాగా.. భారత్‌కు చెందిన 25 ఏళ్ల యశ్ అగర్వాల్ తన ఉద్యోగం పోయిందని ట్విట్టర్‌లో పేర్కొనడం వైరల్‌గా మారింది. ట్విట్టర్ మౌలిక సదుపాయాల ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8208 కోట్లు) వరకు తగ్గించుకోవాలని మస్క్..ట్విటర్ టీంను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భారీగా కోతల ప్రక్రియను చేపట్టినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.