న్యూఢిల్లీ : తప్పుడు సమాచారాన్ని కలిగివున్న ట్వీట్‌పై చర్యలు తీసుకోవాలంటూ వ్యక్తులు రిపోర్ట్ చేసే సామర్ధ్యాన్ని ట్విట్టర్ కంపెనీ తొలగించింది. ఆస్ట్రేలియాలో పార్లమెంట్‌లో ఆదివాసీల గళం అన్న అంశంపై రిఫరెండం జరగడానికి కొద్ది వారాల ముందుగా ఈ చర్య తీసుకుంది.
2021 ఆగస్టు వరకు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాల్లో మాత్రమే ఇలా రిపోర్టు చేయగల సౌలభ్యం అందుబాటులో వుండేది, ఆ తర్వాత 2022 ప్రారంభంలో బ్రెజిల్, ఫిలిప్పీన్స్, స్పెయిన్‌లకు కూడా విస్తరించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సాధనం యొక్క ప్రాముఖ్యతను కంపెనీ గమనంలోకి తీసుకోవడంతో ఆ దేశాల్లో కూడా అమలు చేశారు. కానీ ఇప్పుడు గత ఒకటి రెండు వారాల్లో ఆయా దేశాల నుండి ఈ టూల్‌ను తొలగించారని డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ క్రిటిక్ గ్రూప్ రీసెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియాలో రిఫరెండం జరగడానికి కొద్ది వారాల ముందుగా ఈ చర్య తీసుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఉద్దేశపూర్వకంగానే ఈ టూల్‌ను తొలగించినట్లైతే ఆస్ట్రేలియా ఎన్నికల సమగ్రత దెబ్బతింటుందని పేర్కొంది. దీనిపై ట్విట్టర్‌ను సంప్రదించగా, బిజీగా ఉన్నాం, తర్వాత సంప్రదించాలంటూ ఆటో రిప్లై వచ్చింది.