Jul 29,2021 13:39

ఢిల్లీ : హుజూరాబాద్‌ ఎన్నికల బరిలోకి దూసుకెళ్ళడంలో కాంగ్రెస్‌ వెనుకబడి ఉందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బిజెపి అభ్యర్ధి ఈటెల రాజేందర్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కాంగ్రెస్‌కు ఐదు శాతం మించి కూడా ఓట్లు రావని అన్నారు. హుజూరాబాద్‌కు అభ్యర్థిని ప్రకటించి పార్టీ ప్రచారం, కార్యక్రమాలు వేగవంతం చేస్తే కాంగ్రెస్‌ కు విజయవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తపడాల్సి ఉందని పేర్కొన్నారు. నల్గండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడమే ప్రస్తుతం తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే భయంతోనే నల్గండ జిల్లాలో తమ హయాంలో ప్రారంభించిన ఎస్సెల్బీసీ టన్నెల్‌, ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం లేదని ఆయన తెరాస ప్రభుత్వాన్ని ఆక్షేపించారు. ప్రస్తుతం తెలంగాణలో పాలన అంతా మంత్రి కేటీఆర్‌ మిత్రుడు తేజ రాజు చేతిలో ఉందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలులో ఉన్న సత్యం రామలింగరాజు కుమారుడే తేజ రాజు అని ఆయన తెలిపారు.