Jul 26,2021 11:16

పాల్వంచ : తల్లిదండ్రులు తిడతారన్న భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన కొత్తగూడెంలోని కారుకొండ రామవరంలో చోటుచేసుకుంది.
    పూర్తి వివరాల్లోకెళితే... ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్‌, భారతి దంపతులకు పదిహేనేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఆర్నెల్ల ప్రాయం ఉన్న బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. ఏడేళ్లు పాపే ప్రాణంగా ఆ దంపతులు బతికారు. ఆదివారం పాప ఎనిమిదో పుట్టినరోజు వేడుకను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం కొత్తగూడెంలోని కారుకొండ రామవరంకు వెళ్లారు. సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఆ సమయంలో ఓ విషపాము పాప వేలిపై కాటేసింది. దీంతో భయపడిన చిన్నారి ఒక్కసారిగా ఇంట్లోకి పరుగు తీసింది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచిపెట్టింది. మేకు గుచ్ఛుకుందని అబద్ధం చెప్పింది. ఎలాంటి గాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిసేపటికే అఖిల నోట్లోంచి నురగ రావడంతో పాము కాట్లను వేలిపై గుర్తించారు. వెంటనే స్థానిక ఆర్‌ఎంపి వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంకు తీసుకెళ్లారు. అయిదారు ఆసుపత్రులకు వెళ్లినా పాపను చేర్చుకోలేదు. అంబులెన్స్‌లో ఖమ్మంకు తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి శనివారం రాత్రి మఅతిచెందింది. ఆదివారం బంధువులు పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.