Nov 28,2022 15:51

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న కొండపోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలంటూ మండలంలోని బడదనాంపల్లి పంచాయితీ కొత్తవీది గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం  స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ గిరిజనులు మాట్లాడుతూ, కొత్త వీధి గ్రామంలో 53 కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది జనాభా నివసిస్తున్నారని వారిలో 60 మంది రైతులు సుమారు 100 ఎకరాలకు పైగా కొండపోడు భూమి సాగు చేస్తున్నారని, పదిమంది రైతులకు 2021లో 20 ఎకరాలు భూమికి పట్టాలు ఇచ్చారని తెలిపారు. మిగతా 50 మంది రైతులకు నేటికీ పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాగు చేస్తున్న కొండబోడు భూములకు గతంలో సర్వేలు కూడా నిర్వహించారని తెలిపారు. తక్షణం తమకి కొండపోడు భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని లబ్బర్తి ఎంపిటిసి, టిడిపి మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తాహసిల్దార్ ఏ సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దొడ్డంరెడ్డి చిన్నతల్లి, చల్లా సీతాదేవి, భోనెం సత్తిబాబు, డి సరోజిని, ఎస్ బోడబ్బాయి, చల్లా దేవుడు, డి శివప్రసాద్ పాల్గొన్నారు.