Aug 08,2021 16:42

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ప్రశంసలతోపాటు నజరానాలు, బంపర్‌ ఆఫర్లు భారీగానే అందుతున్నాయి. భారతదేశం తరుఫున పాల్గొని స్వర్ణం సాధించిన వెంటనే నీరజ్‌ చోప్రాకు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సేవలు అందజేస్తామని ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు దేశీయ విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు స్టార్‌ ఎయిర్‌, గో ఫస్ట్‌ ఆదివారం ప్రకటించాయి. జీవితకాలమంతా ఉచితంగా టికెట్లు అందజేస్తామని స్టార్‌ ఎయిర్‌ తెలపగా.. ఐదేళ్లపాటు ఉచిత సేవలు అందిస్తామని గో ఫస్ట్‌ వెల్లడించింది. ఈ సారి పతకాలు కైవసం చేసుకున్నవారిలో నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), పివి సింధు (బ్యాడ్మింటన్‌), మీరాబాయి చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌), రవికుమార్‌ దహియా (రెజ్లింగ్‌), లవ్లీనా బొర్గొహెయిన్‌ (బాక్సింగ్‌), బజరంగ్‌ పునియా (రెజ్లింగ్‌)తోపాటు హాకీ జట్టు ఉన్న విషయం తెలిసిందే.