Jul 25,2021 20:23

టోక్యో : ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో మేరీ కోమ్‌, టేబుల్‌ టెన్నిస్‌లో మనికా బాత్రా తప్ప మిగతా పోటీల్లో భారత ప్లేయర్స్‌ దారుణంగా విఫలమయ్యారు. బాక్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌లలో మిశ్రమ ఫలితాలు రాగా.. షూటింగ్‌, హాకీ, టెన్నిస్‌, స్విమ్మింగ్‌లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. భారత స్విమ్మర్లు మానా పటేల్‌, శ్రీహరి నటరాజ్‌ ఆదివారం నిరాశపర్చారు.

మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగం హీట్‌-1లో మానా పటేల్‌ రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. మానా 1:05.20 నిమిషాల్లో ఈ పోటీలను పూర్తి చేయగా.. జింబాబ్వేకు చెందిన స్విమ్మర్‌ డొటానా కటాయి 1:02.73 నిమిషాల్లో పూర్తి చేసి తొలి స్థానం సంపాదించింది. గ్రెనాడాకు చెందిన కింబర్లీ ఇన్స్‌ 1:10.24 నిమిషాల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్‌-16లో నిలిచిన స్విమ్మర్లే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 39వ స్థానంలో ఉన్న మానా అర్హత సాధించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న మానా పటేల్‌ 'యూనివర్సాలిటీ కోటా' కింద ఈ విశ్వక్రీడల్లో పోటీపడింది.

పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగం హీట్‌-3లో సెమీస్‌కు అర్హత సాధించడంలో యువ భారత స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ కూడా విఫలమయ్యాడు. శ్రీహరి 54.31 సెకన్లలో పోటీలను పూర్తిచేసి.. ఐదో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 27వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే మానా పటేల్‌ కంటే శ్రీహరి నటరాజ్‌ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు.