Jul 27,2021 11:22

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 3-0 తేడాతో ఘన విజయాన్ని సాధించింది. గత మ్యాచులో 1-7 తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా మళ్లీ బలాన్ని పుంజుకుంది. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (14వ నిమిషం), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (15ని, 51ని) చక్కని గోల్స్‌తో ఆకట్టుకున్నారు.

మెల్లగా పుంజుకున్న స్పెయిన్‌కు 12వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ లభించినా ఫలితం లేకపోయింది. తొలి క్వార్టర్‌ చివర్లో భారత్‌ పదేపదే దాడులు కొనసాగించి విజయవంతమైంది. సిమ్రన్‌జీత్‌ తొలి గోల్‌ కొట్టాడు. ఆఖరి నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌పాల్‌ సద్వినియోగం చేసి భారత్‌ను 2-0తో మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 51వ నిమిషంలోనూ అతడే పెనాల్టీ స్ట్రోక్‌ రూపంలో మరో గోల్‌ కొట్టి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు.

ఈ మ్యాచుకు ముందు ప్రపంచ నాలుగో ర్యాంకు టీమిండియా ఆరంభ పోరులో న్యూజిలాండ్‌ను 3-2 తో ఓడించిన సంగతి తెలిసిందే. స్పెయిన్‌కు మాత్రం ఇప్పటికీ విజయం దక్కలేదు. అర్జెంటీనాపై 1-1తో డ్రా చేసుకోగా, 3-4 తేడాతో కివీస్‌ చేతిలో ఓడింది. కాగా టీమిండియా పురుషుల జట్టు తర్వాతి మ్యాచ్‌ను జూలై 29 (గురువారం)న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది.