Jul 26,2021 17:15

టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఖాతాలోకి మొదటి పతకాన్ని సాధించిన అథ్లెట్‌ మీరాబాయి చాను. కరణం మల్లీశ్వరి తర్వాత మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో మీరాబాయి (21) రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. అయితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి మారనుందా? ఇదే విభాగంలో స్వర్ణం సాధించిన చైనా అథ్లెట్‌ జిహుయి హుకి డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు మీడియా ప్రకటించింది. 49 కిలోల విభాగంలో జిహుయి మొత్తం 210 కిలోలు లిఫ్ట్ చేసి  పసిడి పతకం సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116 కిలోలు లిఫ్ట్‌ చేసి విజయం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115కిలోలు మొత్తంగా 202 కిలోలను లిఫ్ట్‌ చేసి రజత పతకాన్ని సాధించారు. కొన్ని కారణాల వల్ల జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్‌ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఆమెకు మరోసారి డోప్‌ పరీక్షలు చేయనున్నారని మీడియా వెల్లడించింది. ఆ పరీక్షల్లో జిహుయి విఫలమైతే మీరాబాయి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. దీంతో రజతం నుండి స్వర్ణ పతకానికి మార్చవచ్చు. అయితే ఈ అంశంపై మరింత సమాచారం, స్పష్టత రావాల్సి ఉంది.