Jul 26,2021 13:07

టోక్యో : ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌లో(కత్తియుద్దం) భారత్‌ తరుపున ఆడిన మొదటి క్రీడాకారిణిగా భవానీ దేవి స్ఫూర్తిదాయక స్థానాన్ని సంపాదించారు. తొలి రౌండ్లో ఘన విజయాన్ని సాధించిన ఆమె రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. ప్రపంచ మూడో ర్యాంకర్‌తో పోరాడి వెనుదిరిగారు. ఆమె పతకం తేనప్పటికీ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఆడిన మొదటి క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోనున్నారు.

తొలి రౌండ్‌లో ఘన విజయం..
కత్తియుద్ధంలో మొదట 15 పాయింట్లు సాధించినవారిని విజేతగా ప్రకటిస్తారు. అవతలివారిని కత్తితో స్పర్శించిన ప్రతిసారీ ఒక పాయింటు ఇస్తారు. తొలిరౌండ్లో ట్యునీషియా అమ్మాయి నడియా బెన్‌ అజిజిపై ప్రపంచ 42 వ ర్యాంకు భవానీ దేవీ ఘన విజయాన్ని సాధించారు. 15-3 తో రెండు పిరియడ్లలోనూ దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థిని అసలు తేరుకోనివ్వలేదు.

స్ఫూర్తితో పోరాడిన భవానీ దేవీ..
మొదటి రౌండ్‌లో ఘన విజయాన్ని సాధించిన భవానీకి రెండవ రౌండ్‌లో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. రియో ఒలింపిక్స్‌ సెమీ ఫైనలిస్టు, ప్రపంచ మూడో ర్యాంకు మేనన్‌ బ్రూనెట్‌ (ఫ్రాన్స్‌) తో ఆమె తలపడ్డారు. బలమైన ప్రత్యర్థే అయినప్పటికీ భవానీ తెగువతో పోరాడారు. 'రైట్‌ ఆఫ్‌ వే' నిబంధన ప్రకారం మేనన్‌కు అధిక పాయింట్లు లభించాయి. మొదటి పిరియడ్‌లో కేవలం 2 పాయింట్లే భవానీ సాధించారు. 2-8 తేడాతో వెనకబడిన ఆమె రెండో పిరయడ్లో దూకుడు పెంచి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 6-12 కు తగ్గించారు. విజయానికి మరో 3 పాయింట్లే అవసరం కావడంతో మేనన్‌ సునాయాసంగా క్వార్టర్‌ఫైనల్‌ చేరుకుంది. బలమైన ప్రత్యర్థితోనూ విజయానికి చేరువగా భవానీ దేవీ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారు.