Aug 01,2021 16:31

టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలిపింక్స్‌లో ఆదివారం ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. హెవీవెయిట్‌ బాక్సింగ్‌ విభాగంలో ఫ్రాన్స్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌ బాక్సింగ్‌ రింగ్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. ఈ రోజు (ఆదివారం) ఉదయం బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడిన సందర్భంగా మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో రెండో రౌండ్‌లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపర్చడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యాయనిర్ణేతలు ఈ మ్యాచ్‌లో ఫ్రేజర్‌ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఫ్రాన్స్‌ బాక్సర్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్ద కూర్చొని నిరసన తెలిపాడు. అనంతరం ఆ దేశ టీమ్‌ అధికారులొచ్చి అతడితో మాట్లాడాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, 15 నిమిషాల తర్వాత మళ్లీ తిరిగొచ్చి అక్కడే కూర్చొని తన అసహనం ప్రదర్శించాడు.