Nov 19,2023 10:28

ఈ రోజుల్లో చిన్నా పెద్ద తేడాలేకుండా తమ కంటే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ల మోజులో పడిపోతున్నారు. దీనివల్ల ఫోన్‌ బ్యాటరీ పాడవడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, మనం ఫోన్‌ వాడుతున్న తీరు, మన అలవాట్లు బ్యాటరీని త్వరగా దెబ్బతీస్తాయి. దీనివల్ల ఫోన్‌ బ్యాటరీ కూడా పేలిపోవచ్చు. తెలియక కొందరు, తెలిసి కొందరు చేస్తున్న పొరపాట్లలో స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీకి సంబంధించిన కొన్ని అలవాట్లను వదులుకోవాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • అధికంగా ఛార్జ్‌ చేయడం..

ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జ్‌ చేయడం వల్ల దాని బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల, బ్యాటరీ ఛార్జ్‌ అయిన వెంటనే ఛార్జర్‌ను తీసివేయడం మంచిది. బ్యాటరీని 100 శాతం ఛార్జ్‌ చేయకుండా 95 శాతం వరకు ఛార్జ్‌ చేయాలని నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు. అదే సమయంలో, బ్యాటరీని పదేపదే ఛార్జింగ్‌ చేయడం కూడా నివారించాలి.

  • బ్యాటరీ వేడెక్కడం..

బ్యాటరీ అధికంగా వేడెక్కడం వలన దాని ఒత్తిడి పెరుగుతుంది. దాని జీవితకాలం తగ్గుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోవడం మనం గమనించకపోతే.. బ్యాటరీ నుంచి మంటలు రావడానికి కూడా కారణమవుతుంది. అదే సమయంలో, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సమయంలో బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది దాని జీవితకాలాన్ని తగ్గిస్తుందని గుర్తుంచుకోవాలి.

  • నిర్దిష్ట ఫోన్‌ ఛార్జర్‌నే వాడాలి..

ఫోన్‌ను త్వరగా ఛార్జ్‌ చేయడానికి, ఎక్కువ వోల్ట్స్‌ ఉన్న ఛార్జర్‌ని ఉపయోగించడం గురించి మనం తరచుగా ఆలోచిస్తాము. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది కూడా కావచ్చు. ఇది బ్యాటరీపై ఒత్తిడిని కలిగిస్తుంది.. నష్టాన్ని పెంచుతుంది. అందువల్ల, నిర్దిష్ట ఫోన్‌ కోసం రూపొందించిన ఛార్జర్లను మాత్రమే ఉపయోగించండి.

5
  • బ్యాటరీ పూర్తిగా ఖాళీ చేయొద్దు..

బ్యాటరీ పూర్తిగా డెడ్‌ అయ్యేంత వరకూ ఫోన్‌ ఉపయోగించడం వల్ల.. దాని జీవితకాలం తగ్గుతుంది. మీరు ఎప్పుడూ బ్యాటరీ ఛార్జింగ్‌ని 20-80 శాతం మధ్య ఉంచుకోవడం మంచిది.

  • యాప్స్‌ ఎక్కువైనా..

స్మార్ట్‌ఫోన్‌లలో మన అవసరానికి మించిన యాప్‌లు వుంచుకోవడం బ్యాటరీ లైఫ్‌ తరిగిపోవడానికి కారణమౌతుంది. చాలా యాప్‌లను రన్‌ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. ప్రత్యేకించి యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ ఉంటాయి. యాప్‌ల అధిక వినియోగం స్మార్ట్‌ఫోన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల అవసరం లేని యాప్‌లను తొలగించడం మంచిది.

  • బ్రైట్‌నెస్‌.. డ్రెయిన్‌ అవుట్‌ :

ఫోన్‌ బ్రైట్‌నెస్‌ని పెంచడం వల్ల దాని బ్యాటరీ త్వరగా డ్రెయిన్‌ అవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఫోన్‌ను ఆటో బ్రైట్‌నెస్‌ మోడ్‌లో ఉంచుకోవడం ఉపయోగం.

  • బ్యాటరీ సేవర్‌

చాలా సార్లు బ్యాటరీ సేవర్‌ యాప్స్‌ ఫోన్‌ బ్యాటరీ వినియోగాన్ని పెంచుతాయి. వాస్తవానికి, ఈ యాప్‌లు అవసరం లేనప్పుడు కూడా బ్యాటరీని వినియోగించే నేపథ్యంలో నిరంతరం రన్‌ అవుతాయి. అలాగే, దీన్ని పదే పదే రన్‌ చేయడం వల్ల ఫోన్‌ పనితీరుపై ప్రభావం చూపడం వల్ల కూడా బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. అందువల్ల బ్యాటరీ సేవర్‌ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి.

  • ఫోన్‌ని కూల్‌ చేయడం

ఫోన్‌ చాలా వేడిగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు దానిని ఐస్‌లోనో లేదా ఫ్రిజ్‌లోనో ఉంచాలనే ఆలోచన చాలామందికి వస్తుంది. పొరబాటున ఇలాగాని చేస్తే.. అది ఫోన్‌ బ్యాటరీకి హాని కలిగించే ప్రమాదం వుంది.
ఈ జాగ్రత్తలు పాటించడంతో పాటు.. అవసరాన్ని బట్టి ఫోన్‌ వాడటం, అవసరమైన మేరకే యాప్‌లు నిక్షిప్తం చేసుకోవడం మంచి అలవాటు. తద్వారా ఎక్కువ రేటుతో కొన్న ఫోన్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఫోన్‌ను పరిమితంగా వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవచ్చు.