సౌమ్య పదో తరగతి చదువుతోంది. జెండా వందనానికి తన తమ్ముని వెంట బెట్టుకుని వచ్చింది. బాబు ముద్దుగా ఉండడంతో అందరూ బుగ్గ గిల్లి ముద్దు చేస్తున్నారు. ఇంతలో సోషల్ టీచర్ రాగానే అందరూ 'గుడ్ మార్నింగ్ మేడమ్' అన్నారు. సౌమ్య తమ్ముడు కూడా వచ్చిరాని మాటలతో 'గుడ్ మార్నింగ్' అన్నాడు. 'గుడ్' అంది మేడమ్. జెండా ఎగురవేయటానికి స్టాఫ్ అంతా రావడంతో పిల్లలందరూ వరుసగా నిలుచున్నారు.
హెచ్‌ఎం గాయత్రి జెండాను ఎగురవేశారు. మువ్వన్నెల జెండా రెప రెప లాడుతుంటే పిల్లలందరూ శాల్యూట్ చేశారు. సౌమ్య తమ్ముడు కూడా శాల్యూట్ చేశాడు. పిల్లలందరికి మిఠాయిలు పంచారు. ఓ బుల్లి జెండాను గాయత్రి మేడమ్, ఆ బాబుకు ఇచ్చారు. ఆ జెండాను చూడగానే వాడు కేరింతలు కొట్టాడు. జెండాను అటు ఇటు ఊపుతూ ఆడుకున్నాడు. కాసేపటికి జెండా కింద పడిపోయింది. ఈసారి వాడు దాన్ని తొక్కుతూ ఆడు కున్నాడు. పిల్లలు అందరూ చూస్తున్నారే కాని ఎవరూ వారించలేదు. అప్పుడు, సోషల్ టీచర్ వాడి దగ్గరకు వెళ్ళి 'బాబూ, జెండాను అలా తొక్కరాదు, మురికి చేయరాదు, నలప రాదు. చక్కగా ఉండాలి, తీసి జేబులో పెట్టుకో' అన్నారు. ఇంతలో సౌమ్య దగ్గరకు వచ్చి 'సారీ మేడమ్' అంది. 'సారీ కాదు సౌమ్యా.. ఇంటికి వెళ్ళాక జెండాను శుభ్రంగా ఉతుకు. మురికిగా ఉండకూడదు.' అని చెప్పారు.
అలాగే మేడమ్ అంది సౌమ్య.
- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027










