పులివెందుల టౌన్ : ఏ కూరగాయలు లేకున్నా.. కనీసం టమోటా ఉంటే చాలు ఏదోకటి వండుకుని కడుపునింపుకోవచ్చు అనేది సామాన్య, మధ్య తరగతి ప్రజల అభిప్రాయం. ప్రస్తుతం అది పూర్తిగా విరుద్ధం. టమోటా ధర సామాన్య, మధ్య తరగతి వారికి అందే పరిస్థితిలో లేదు. కూర గాయల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్ వెళ్లి ఏ కూరగాయ కొనాలన్నా గుండె గుభేలుమంటోంది. ఏమి కొనలేక అల్లాడి పోతున్నారు సామాన్య జనం. ఒక్కోసారి కిలో రూ.1అన్నా కొనేవారులేక పొలం, రోడ్లపై పారేశారు. ఇప్పుడు టమోటా బంగారం అయింది. కిలో రూ.120 ధర పలుకుతోంది. ఈ ధర మరో 45 రోజులపాటు ఇలానే కొన సాగు తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి టమోటాకు ధర లేక రైతులు దాని సాగుపై ఆసక్తి చూపలేదు. అంతెం దుకు గత నెలలో టమోటాకు గిట్టుబాటు ధర లేదని రైతులు పొలాల్లోనే దిగుబడిని వదిలేశారు. ఈ నేపథ్యంలో విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో టమోటాకు డిమాండు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
సంపాదనంతా కూరగాయకే..
స్థానిక దుకాణాల్లో కిలో టమోటా రూ.120తో కొన్నాను. వంటలో టమోటా తప్ప నిసరి కావడంతో కొనుగోలు చేయక తప్పలేదు. మా కుటుంబానికి రెండు రోజులకు మించి రావు. ఈ లెక్కన నెలకు టమోటాలకే రూ.2 వేలు వెచ్చించాల్సి వస్తుంది. గతంలో నెలకు అన్ని కూరగాయలకు కలిపి ఆ ఖర్చు అయ్యేది.
- సావిత్రి, వ్యవసాయ కూలీ, పులివెందుల
కొనే పరిస్థితి కనిపించడంలేదు..
మాది ఉమ్మడి కుటుంబం. 10 మంది సభ్యులు ఉంటాం. స్థానికంగా చిన్న కిరాణా షాపు ఏర్పాటు చేసుకొని జీవనం సాగి స్తున్నాం. 15 రోజుల క్రితం టమోటో కిలో రూ.30 ఉండేది. ఇప్పుడు రూ.120 చేరుకుంది. దీంతో కొనే పరిస్థితి లేదు. టమోటో లేనిదే వంట పూర్తవ్వదు.
- ప్రభావతి, గృహిణి, పులివెందుల
పొలంలోనే పంటను దున్నేశాం..
ఏప్రిల్ మొదటి వారంలో అయిదెకరాల్లో టమోటా సాగు చేసాం. పంట బాగా పండింది. కానీ ధర లేక జూన్ మొదటి వారంలో పంటను దున్నేశాం. మూడు లక్షల దాకా నష్టం వాటిల్లింది. పంట దున్నిన తర్వాత టమోటా ధరలు పెరగడం ప్రారంభించాయి.
- మాధురి, రైతు ఆక్కులగారిపల్లి, లింగాల










